మాజీ ఎంపీ, విశాఖ మాజీ మేయర్ సబ్బం హరి కరోనాకు చికిత్స పొందుతూ కన్ను మూశారు. విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన పది రోజులుగా చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. మధ్యలో కోలుకున్నట్టు కనిపించినా తరవాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్యం అందించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విశాఖ మేయర్‌గా పనిచేసి ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా పాలించి ప్రజల మన్ననలు పొందారు. విశాఖ నగరంలో పారిశుద్ధ్యాన్ని దేశంలోనే మొదటిసారిగా ప్రైవేటీకరించి సత్ఫలితాలు సాధించారు. కాంగ్రెస్ పార్టీలో మూడు దశాబ్ధాల పాటు పనిచేసిన సబ్బం హరి ఏపీ విభజన తర్వాత టీడీపీలో చేరారు.
విశాఖలో తనదైన ముద్ర
విశాఖ నగర అభివృద్ధిలో సబ్బంహరి తనదైన ముద్ర వేశారు. డంపింగ్ యార్డు సమస్యను మూడు రోజుల్లో పరిష్కరించి 100 ఎకరాల్లో శాశ్వత డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. బీచ్ రోడ్డును అభివృద్ధి చేయడంలో కీలకంగా వ్యవహరించారు. విశాఖలోని కొండవాలు ప్రాంతాల్లో నివశించే పేదలందరికీ ఉచితంగా నీటి కుళాయిలు ఏర్పాటు చేయించి ప్రజల మన్ననలు అందుకున్నారు. సబ్బం హరి మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం నిజాయితీ పరుడైన ఒక రాజకీయ నేతను కోల్పోయిందన్నారు.











