తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు నింపేందుకు చంద్రబాబునాయుడు తీవ్ర కసరత్తే చేశారని తెలుస్తోంది. పార్టీ పదవుల్లో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు పెద్దపీట వేశారని సమాచారం. పార్టీలో యువనేతలను ప్రోత్సహించాలని చంద్రబాబు నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే పార్లమెంటు స్ధాయిలో ఉత్సాహవంతులనే అధ్యక్షులుగా నియమించారు. సెప్టెంబర్ 27న 51 మందితో పార్లమెంటు స్థాయిలో పార్టీ పదవులను భర్తీ చేశారు. ఆరోజే పార్టీ అధ్యక్షుడిగా కింజరావు అచ్చన్నాయుడు పేరు కూడా ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ అచ్చన్నపేరు ప్రకటన విడుదల కాలేదు. టీడీపీ అధ్యక్ష పదవికి నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర పేరు అనూహ్యంగా పరిశీలనకు రావడంతో అచ్చన్నాయుడి పేరు ప్రకటన వాయిదా పడింది.
వారంలో ప్రకటన
అక్టోబర్ తొలి వారంలో టీడీపీ అధ్యక్ష పదవితోపాటు, మిగిలిన అన్ని పదవులను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చన్నాయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా బీద రవిచంద్రను నియమించనున్నారని సమాచారం. ఇక ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావును పొలిట్ బ్యూరోలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక కొల్లు రవీంద్రకు కూడా టీడీపీలో కీలక పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చినబాబు కసరత్తు, పెదబాబు ఫైనల్
ఏ జిల్లా నుంచి ఎవరికి పార్టీ పదవులు కట్టబెట్టాలి. అందులో సామాజికవర్గాల వారిగా అందరికీ న్యాయం జరిగేలా టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ తీవ్ర కసరత్తు చేశారు. వారం రోజులు మంగళగిరి టీడీపీ కార్యాయంలోనే మకాం వేసి, ప్రతి కార్యకర్త అభిప్రాయాలను ఐవీఆర్ఎస్ ద్వారా తెలుసుకుని ఒక రిపోర్ట్ తయారు చేశారని వినికిడి. టీడీపీలో పదవి లభించే ప్రతి నాయకునిపై కార్యకర్తలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకున్నారు.
వ్యతిరేకత ఉన్న వారిని పక్కన పెట్టారని వినికిడి. టీడీపీలో కష్టపడేవారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయనే సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే లోకేష్ తీవ్ర కసరత్తు చేసి, ఓ రిపోర్టును టీడీపీ అధినేత చంద్రబాబుకు సమర్పించారని తెలుస్తోంది. ఈ రిపోర్టును పరిశీలించి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. రాబోయే వారం రోజుల్లో (శుక్రవారం కావచ్చు) టీడీపీలో అన్నీ పదవుల భర్తీని పూర్తి చేసి, క్యాడర్లో ఉత్తేజం నింపాలని చంద్రబాబు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
తెలుగు యువత విషయంలో నేటికీ రాని క్లారిటీ
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మాజీ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే తెలుగు యువతను నడిపించాలంటే ఛరిస్మా కలిగిన నాయకుడు కావాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అటు రామ్మోహన్ నాయుడు, పరిటాల శ్రీరామ్ తెలుగు యువత బాధ్యతలు మోసేందుకు సంసిద్దత వ్యక్తం చేయలేదట. అందుకే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షపదవి ఎవరిని వరిస్తుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.











