గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారీ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. నువ్వా.. నేనా అన్నట్లుగా రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య పోటీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెలకొంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికినీ ఇప్పటి నుంచే రాజకీయాలు వ్యూహాలను రచిస్తూ కత్తులు దూసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. నల్లగొండ-ఖమ్మం-వరంగల్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానల్లో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్తానానికి టిఆర్ఎస్ నుంచి ప్రస్తుతం పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రాతినథ్యం వహించగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గం స్థానానికి బిజెపి నుంచి రాంచందర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ సారీ తెరాస పార్టీ ఈ రెండు నియోజకవర్గాలపై గురిపెట్టింది. ఎలాగైనా ఈ రెండు స్థానాలపై గులాబీ జెండాను ఎగరవేయాలనే ఉత్సుకతతో ఆ పార్టీ ఉంది. దానికనుగుణంగానే తెరాస తమ పార్టీ శ్రేణులను అక్కడ ప్రచార కార్యక్రమాలను చేపట్టేందుకు రంగంలోకి దింపింది. అలాగే ఈ ఎన్నికల ప్రక్రియను స్వయంగా కెటిఆరే పర్యవేక్షిస్తున్నారు.
కమ్యూనిస్టుల దారి గులాబీ వైపేనా..
అయితే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిస్సైన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంతో పాటు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ సిట్టింగ్ స్తానాన్ని కూడా ఈసారి చేజిక్కించుకోవాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అక్కడ తనకు కొద్దిగా అనుకూల పవనాలే వీస్తున్నాయి. ఇక్కడి నుంచి తెరాసకు కోదండరామ్ గట్టిపోటినివ్వబోతున్నట్లు తెరాస అంతర్గతంగా జరిపిన సర్వేలో తేలినట్లు సమాచారం. ఆ సిట్టింగ్ స్థానాన్ని చేజారనివ్వకుండా తెరాస నాయకత్వం సరికొత్త స్ట్రాటజీ అమలుచేస్తున్నదనే చర్చ జరుగుతోంది. ఈక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం పార్టీలతో తెరాస తెరవెనుక మిలాఖత్ అయినట్లు పొలలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కోదండరామ్‌కు సిపిఐ పార్టీ ఈ ఎన్నికల్లో మద్దతు ఇస్తుందని అంతా అనుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని సిపిఐ పార్టీని కోదండ రామ్ కోరారు. కానీ మద్దతిచ్చే అంశంలో సిపిఐ పార్టీ ఇప్పిటికీ స్పష్టత ఇవ్వడంలేదు. తాము కూడా ఎన్నికల్లో అభ్యర్థిని నిలుపుతామని ఒకసారీ, మరోసారేమో మద్దతిచ్చే విషయం ఆలోచిస్తామనే నాన్చుడు ధోరణీ అవలంభిస్తుంది. సిపిఎం కూడా తాము అభ్యర్థిని పోటీలో నిలుపుతామనే సంకేతాలను ఇస్తూనే మరోవైపు తెరాసతో పొత్తుగురుంచి కూడా ఆ పార్టీ ఆలోచిస్తున్నట్లు చర్చజరుగుతోంది.
తెరవెనుక తెరాస ప్లాన్?..
కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టిడిపి, ఇంటిపార్టీతో సహా కలిసి వచ్చే చిన్నా చితక పార్టీలను, సంఘాలను కలుపుకొని తెరాసకు ఈ ఎన్నికల్లో దెబ్బకొట్టాలని కోదండరామ్ భావిస్తున్నారు. దీనికి విపక్షపార్టీలను ఏకం చేసి ఎన్నికల్లో ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఆయన ఉన్నారు. ఉందడమే కాదు.. దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తి చేశారు. అయితే పార్టీలతో టిజెఎస్‌కు ఏమాత్రం పొత్తు పొసగడంలేదు. ఒక్కోపార్టీ ఒక్కోలా భిన్నవాదనలను, డిమాండ్‌లను ఆయన ముందు ఉంచుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు వద్దని సిపిఎం చెబుతుంది. సిపిఐ ఏమో పార్టీలో నిర్ణయం తీసుకొని చెబుతామంటుంది. ఇక ఇంటి పార్టీనేమో కోదండరామ్ పోటీ చేసే నల్లగొండ స్థానం నుంచి తానే పోటీచేస్తానని చెరుకుసుధాకర్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి విషయానికొస్తే ఎమ్మెల్సీ ఎన్నికలపై సబ్‌కమిటీ వేసింది.
పైకి ఇవన్నీ కారణాలు బెబుతున్నా ఎవరికి వారు తమ అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సిపిఐ, సిపిఎం మాత్రం ఇన్‌టర్నల్‌గా తెరాసతో పొత్తులు పెట్టుకున్నాయనే వాదనలూ బలంగా వినిపిస్తున్నాయి. తమకు ఉన్న ఆర్థిక అవసరాల నేపథ్యంలో ఆ మూడు జిల్లాల్లో కాస్త బలంగా ఉన్న కమ్యూనిస్టులు తెరాసతో అంటకాగుతున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఈనేపథ్యంలోనే కొదండరామ్ కు మద్దతివ్వకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా తమ అభ్యర్థులను బరిలో నిలిపి, ఓట్లను చీల్చి కోదండరామ్‌కు ఓడించాలనే ఉద్ధేశంతో ఈ సరికొత్త యాక్షన్ ప్లాన్‌ను తెరవెనుక నుంచి గులాబీ బాస్ అమలు పరుస్తున్నట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా కోదండ రామ్‌కు మద్దతు ఇచ్చే విషయం గురించి నాన్చుతోంది. ఇలా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ వైఖరీవల్ల రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకే లాభం చేకూరుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.