అందరికీ సినిమా చూపించే ఎగ్జిబిటర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇది ఏపీలో ఉన్న పరిస్థితి. థియేటర్లో సినిమా వేస్తే కరెంటు ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉంది. అందుకే నిన్నటి నుంచి ఏపీలోని చాలా థియేటర్లలో షోలు పడలేదు. దీనికి తోడు అధికారుల దాడులు ఎక్కువయ్యాయి.
సినిమా థియేటర్ కట్టుకునే బదులు ఏ బ్రాందీ షాపో పెట్టుకుని ఉంటే ఎంచక్కా బోలెడు సంపాదించుకునే వాళ్లం కదా అంటూ థియేటర్ల యజమానులు వాపోతున్నారు. పెద్ద సినిమాలైన అఖండ, పుష్పలకు తోడు ఇప్పుడు నాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ విడుదలవుతోంది. ఏంచేయాలో పాలు పోని పరిస్థితి ఎగ్జిబిటర్లలో ఉంది. ఏపీ నిన్న దాదాపు 20 థియేటర్లలో షోలు పడలేదన్న సమాచారం ఉంది. ఇక అధికారులు తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా సినిమాలు ఆడిస్తున్న థియేటర్లపై కేసులు నమోదు చేశారు. జరిమానాలు విధించారు. కొన్ని థియేటర్లనైతే ఏకంగా సీజ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు, ఎస్పీలు, డీఎస్పీలు థియేటర్లను పరిశీలిస్తున్నారు. వారికి తనిఖీ అధికారం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో సినిమా థియేటర్ల యజమానుల్లో అలజడి మొదలైంది. అధికారులు జారీ చేసే నోటీసులను బట్టి ఏంచేయాలో నిర్ణయం తీసుకోనున్నారు. జీవో 30 ప్రకారం థియేటర్లలో ఉండాల్సిన సౌకర్యాలపై దృష్టిసారించారు. టికెట్ల ధరలు, క్యాంటీన్‌లో తినుబండారాల ధరలు, థియేటర్ల నిర్వహణ తీరుకు సంబంధించి వివిధ శాఖలు జారీ చేసిన అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నారు.

వాటర్ బాటిల్స్ ను ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని, నిబంధనలు పాటించలేదని కొన్ని థియేటర్ల యజమానులకు కూడా నోటీసులు జారీ చేశారు. సినిమా టిక్కెట్ల ధరలు తక్కువగా ఉండటంతో వీరు ఎక్కువ ధరకు వీటిని విక్రయించే అవకాశం లేకపోలేదు. ఒక్క కృష్ణాజిల్లాలోనే 15 థియేటర్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. వీటిలో 12 థియేటర్లను తాత్కాలికంగా మూసివేశారు. ఏలూరులో ఓ థియేటర్ యజమానికి రెండు లక్షల జరిమానా విధించారు. థియేటర్ల నిర్వహణ భారంగా మారిందని ఎగ్జిబిటర్లు అంటున్నారు. నిర్వహణ ఖర్చు నెలకు రూ. 3లక్షల నుంచి 10 లక్షల వరకూ ఉంటుందని అంటున్నారు.
ఒక్క కరెంట్ బిల్లే నెలకు రూ. లక్ష నుంచి 4 లక్షల వరకూ వస్తోందట. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమకు ఈ తనిఖీలు ఇబ్బంది పెడుతున్నాయని, థియేటర్లు మూసివేయక తప్పదని అంటున్నారు. దీనిపై ఓ నిర్ణయం తీసుకోడానికి ఈరోజు ఎగ్జిబిటర్లు సమావేశమవుతున్నారు. ఏపీలో కొన్ని థియేటర్లలో నేల టిక్కెట్ ధర రూ. 5గా నిర్ణయించారు. కొన్నిటికి రూ. 10, రూ. 15, బాల్కనీ రూ. 20 గా నిర్ణయించారు. ఇదిలా ఉంటే తెలంగాణలో మాత్రం కారు పార్కింగుకే రూ. 30 వసూలు చేస్తున్నారు. ఏపీలో ఉన్న విధానానికీ, తెలంగాణలో ఉన్న విధానానికీ ఎక్కడా పొంతనే లేదు. మరి సినిమా పరిశ్రమ పెద్దలు గానీ, ఫిలిం ఛంబర్ గానీ ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.











