టీడీపీ కంచుకోటను తిరిగి నిర్మిస్తారా?
పల్నాడులో టీడీపీ కంచుకోటగా పిలువబడే మాచర్ల నియోజకవర్గానికి ఇంచార్జ్ గా జూలకంటి బ్రహ్మనందరెడ్డిని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. బ్రహ్మారెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో కార్యకర్తలు, నాయకులు పండుగ చేసుకుంటున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థవంతంగా ఢీకొట్టాలంటే, అందుకు సరైనోడు జేబీఆర్ మాత్రమేనని టీడీపీ అధిష్టానం కూడా భావిస్తోంది. ఈ క్రమంలో జేబీఆర్ రాకతో టీడీపీకి పూర్వవైభవం వచ్చేనా? కంచుకోటను తిరిగి నిర్మించి, నియోజకవర్గంలో పార్టీని నిలబెడతాడా? కార్యకర్తలకు పూర్తి భరోసా ఇస్తారా? అన్నదే చూడాలి!
పార్టీల బలం – బలహీనతలు..!
తెలుగు దేశం పార్టీ అవిర్భావ నాటి నుంచి 1983, 1989, 1994,1999 ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ విజయం సాధించింది. 1985, 2004, 2009, 2010, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటిమి పాలైనప్పటికీ .. ప్రత్యర్థి మేజారిటీని అనూహ్యంగా దెబ్బకొట్టి, ఓటు బ్యాంకును పదిలం చేసుకుంది. పిన్నెల్లి కుటుంబం వరుసగా 2004, 2009, 2010 ( ఉప ఎన్నిక ), 2014, 2019 లో వరుసగా విజయాలతో ఐదుసార్లు ఆధిపత్యాన్ని నియోజకవర్గంలో చెలాయిస్తున్నారు. ఈ క్రమంలో స్ట్రాంగ్ ఫర్ఫామెన్స్ ఇచ్చే నాయకుడు టీడీపీలో గతంలో ఇక్కడ కొరవడటం, కొమ్మరెడ్డి చలమారెడ్డి, చిరుమావిళ్ల మధుబాబు, అంజిరెడ్డిలు వంటివారు పిన్నెల్లి కుటుంబం ఏర్పాటు చేసుకున్న గెలుపు కోటకు బీటలు కొట్టలేకపోవడం వంటివి మైనస్ గా కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న టీడీపీ నాయకత్వానికి ఎక్సట్రా బూస్టర్ కావాలి. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు.. మాజీ ఎమ్మెల్యే జూలకంటి దుర్గాంభా కుమారుడు బ్రహ్మానందరెడ్డిని మాచర్ల నియోజకవర్గానికి బాధ్యులుగా నియమిస్తూ.. బుధవారం నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పార్టీ.. మాచర్ల నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత చిరుమావిళ్ల మధుబాబుకు కూడా రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శిగా మధుబాబుకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు.











