ఇప్పుడు నడుస్తున్నదంతా వెబ్ సిరీస్ ల యుగం. ఓటీటీ ఫాట్ ఫారాలు చాలా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే వెబ్ సిరీస్ లు కూడా రూపొందుతున్నాయి. జీ 5లో శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఎక్స్ పైరీ డేట్’ ఇటీవలే విడుదలైంది. యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ గా ఇది తెరకెక్కింది. ఇందులో దర్శకుడు ఏం చెప్పాడు? ఇది ఎలా ఉందన్నది చూద్దాం.
కథేంటి?
మన జీవితంలో ఉన్నట్లే పాత్ర పాత్రకూ ఓ ముగింపు ఉంటుందని చెప్పడమే దర్శకుడి ఉద్ధేశం. ఇది విశ్వ అనే యువకుడి కథ. తను ఎంతో ఆదర్శంగా జీవించాలనుకున్నాడు. తన స్నేహితురాలు దిశను వివాహం చేసుకుంటాడు. అతను వృత్తిరీత్యా ఓ పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓ. తన భార్య తనను మోసం చేసిందని తెలుసుకుని చాలా బాధపడతాడు. అతనికి తన లాగా మోసపోయిన మరో మహిళ తారసపడుతుంది. ఆమెను తన భర్త మోసం చేస్తాడు. వీరిద్దరూ ఏంచేశారు? వీరిని మోసం చేసినవారు ఏమయ్యారు? అనేదే ఈ కథ.
ఎలా తీశారు.. ఎలా చేశారు?
విశ్వగా టోనీ లూకా నటించాడు. అతని మీద హత్యా నేరం నమోదవుతుంది. అతని గెటప్ లో ఇంకా కొంచెం మార్పులు చేసి ఉంటే బాగుండేది. స్నేహ ఉల్లాల్ చక్కగా చేసింది. అయితే ఇది ఓ సాధారణ పాత్ర. మధు షాలిని పాత్ర బాగా పండింది. మధుషాలిని పాత్ర పేరు సుజాత. ఐదో ఎపిసోడ్‌లో ఈ పాత్ర ప్రవేశిస్తుంది. ఏదైనా చేసే ముందు సమాజం ఏమనుకుంటుంది? చుట్టుపక్కల ప్రజలు ఏమనుకుంటారు? అని ఆలోచించే పాత్ర ఇది. ప్రతి దానికీ భయపడుతుంది. ఆమెకు కూడా ఇది తొలి వెబ్ సిరీస్.అలీ రెజా చక్కగా నటించాడు.
పోలీసు పాత్రలో భరత్ రెడ్డి మోతాదు మించి నటించినట్లు ఉంది. ఈ వెబ్ సిరీస్ లో థ్రిల్లింగ్ అంశాల కోసం బాగానే కసరత్తులు జరిగాయి. కొన్ని సందర్భాల్లో లాజిక్ మిస్సయ్యింది. కథనం బిగువుగానే ఉంది. రెండు కథలను సమాంతరంగా దర్శకుడు నడిపారు. మొదట్లో వచ్చిన ఎపిసోడ్ల కన్నా ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్లలో కథనం స్పీడ్ అందుకుంది. నిందితులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాలు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. నేపథ్య సంగీతం బాగా కుదిరింది. సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది. కేసు దర్యాప్తు లాజికల్ గా ముందుకు సాగలేదు. దీనిమీద మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేది.
నటీనటులు: స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా.. కథ ప్రధానంగా ఈ నలుగురి చుట్టూ తిరుగుతుంది.
నిర్మాణం: నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్
దర్శకత్వం: శంకర్ మార్తాండ్
ఎక్కడ చూడాలి?: జీ5
ఒక్కమాటలో: కాలక్షేపానికి చూడొచ్చు.
రేటింగ్: 3/5











