అదేంటో గానీ… టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారంటే చాలు… జగన్ వర్గం విమర్శల బాణాలు ఎక్కుపెడుతూనే ఉంటుంది. వీలున్నదాకా నేరుగానే విమర్శలు సంధించే జగన్ వర్గం… అది కుదరలేదంటే… పరోక్షంగా చంద్రబాబు ప్రతిష్ట తగ్గించేలా వ్యూహాలు రచించి అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అమరావతికి వెల్లువెత్తుతున్న మద్దతును మరుగున పడేసేలా ఓ పకడ్బందీ వ్యూహాన్ని జగన్ వర్గం అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే… ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాగానే… హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం భారీగా పతనమవుతోందన్న ఓ ప్రచారాన్ని సృష్టించిన సదరు వర్గం…తిరిగి అదే వర్గంలోని ఓ కీలక నేతను రంగంలోకి దించి… అబ్బే చంద్రబాబు కారణంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఏమాత్రం పడిపోలేదని ప్రకటనలు ఇప్పిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు ప్రభావాన్ని తగ్గించి చూపడంతో పాటుగా తమకు ఎంతమాత్రం ఇష్టం లేని అమరావతిపై విషం చిమ్మేలా పకడ్బందీ వ్యూహాన్ని సదరు వర్గం అమలు చేస్తోంది.
వాస్తవానికి అమరావతి ప్రభావం ఉన్నా… లేకున్నా… హైైదరాబాద్ రియాల్టీకిి పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా విలసిల్లుతున్న నేపథ్యంలో ఇతరత్రా ఆర్థిక పరిస్థితులు మాత్రమే భాగ్యనగరిపై ప్రభావం చూపగలవు. అంతేకాకుండా గతంలో హైదరాబాద్ లో ఐటీ విప్లవాన్ని అమలు చేసిన చంద్రబాబు..,. ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలన్నీ నగరానికి వచ్చేలా చేశారు,. ఫలితంగా హైదరాబాద్ లో ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన సైబరాబాద్ ను నిలువరించడం ఏ ఒక్క నగరానికి కూడా సాధ్యపడే విషయమే కాదు. అసలు హైదరాబాద్ ఇప్పుడు ఇలా ఉందంటే,… ఎవరు ఔనన్నా, కాదన్నా…దానికి కారణం చంద్రబాబే.
ఈ విషయాలన్నింటినీ పక్కనపెట్టేసి… చంద్రబాబు ఏపీకి మరోమారు సీఎం కాగానే… ఏపీ రాజధానిగా ఎదుగుతున్న అమరావతిలో రియల్ ఎస్టేట్ మంచిగా ఊపందుకుందని, అదే సమయంలో హైదరాబాద్ లో రియల్ బూమ్ పడిపోయిందని ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ ప్రచారాన్ని ఎవరు మొదలుపెట్టారో తెలియదు గానీ,… దానిని .పట్టుకుని… తెలంగాణ కేబినెట్ లో కీలక మంత్రిగా కొనసాగుతున్న జగన్ ముఖ్య అనచరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగిపోయారు. చంద్రబాబు ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏమాత్రం పడిపోలేదని ఆయన చెప్పుకొచ్చారు.
చంద్రబాబు ఏపీ సీఎం అయితే… హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోతుందని కూడా పొంగులేటి ప్రశ్నించారు. ఇదంతా తప్పుడుు ప్రచారమేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని పొంగులేటి.. పెట్టుబడిదారులు అమరావతి కంటే కూడా హైదరాబాద్ కు వచ్చేందుకే అధిక ప్రాధాన్యమిస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. హైదరాబాద్ తో పాటుగా బెంగళూరుకు కూడా పెట్టుబడిదారులు అధిక ప్రాధాన్యమిస్తున్నారని చెప్పిన ఆయన… అమరావతి పట్ల ఆసక్తి చూపిస్తున్నవారు ఎవరూ లేరని వ్యాఖ్యానంచారు. తద్వారా ఏపీలో కొనసాగుతున్న చంద్రబాబు పాలనపైనా, తన బాస్ జగన్ వ్యతిరేకిస్తున్న అమరావతిపైనా ఆయన విషం చిమ్మారు.
వాస్తవానికి చంద్రబాబు ఏపీకి మరోమారు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే… అమరావతికి నూతన జోష్ వచ్చింది. అమరావతి నిర్మాణానికి చంద్రబాబు సర్కారు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.26 వేల కోట్ల రుణాన్ని సమీకరించగలిగింది. అంతేకాకుండా అమరావతిలో తమకు భూములు కేటాయించాలంటూ బడా కంపెనీలు సీఆర్డీఏ ముందు క్యూ కడుతున్నాయి. వాస్తవంగా జరుగుతున్నది ఇది అయితే… అమరావతిని తక్కువ చేసి చూపే క్రమంలో భాగంగానే పొంగులేటి ఈ దుష్ప్రచారానికి తెర తీశారని చెప్పక తప్పదు.