హస్తిన… రైతు నిరసనలతో హోరెత్తుతోంది. యావత్ దేశం కర్షకుని పక్షమైంది. అన్నదాతల ఆవేదనకు మద్దతు పెరుగుతోంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ రోజురోజుకూ రెట్టింపవుతోంది. ఇది.. కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో తెలంగాణలో పసుపు రైతులు రోడ్డెక్కడం చర్చనీయాంశం అవుతోంది. ఢిల్లీ స్థాయిలోనే ఇందూరులో సైతం రైతు ఉద్యమం బలపడబోతోందా? అసలీ పసుపు రైతుల డిమాండ్లు ఏంటి? దశాబ్దాల నుంచి పసుపు రైతులపై సర్కారెందుకు ఇంత వివక్ష చూపుతోంది?
మూడు గంటల పాటు ఆందోళన
పసుపు రైతులు మళ్లీ రోడ్డెక్కారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలొచ్చిన రైతులు ఆర్మూర్ పట్టణం మామిడిపల్లి చౌరస్తా నుంచి 44వ జాతీయ రహదారి వరకు ఊరేగింపు నిర్వహించారు. కొందరు రైతులు పసుపు కొమ్ములు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు మూడు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. రైతు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో ఉద్యమిస్తూ మృతి చెందిన రైతుల ఆత్మకు శాంతి చేకూర్చాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఆ ఎంపీ రాజీనామాకు… ఎందుకంత డిమాండ్?
పసుపు రైతుల ఆందోళనకు ఎంపీ అర్వింద్‌కు ఉన్న సంబంధమేంటి? ఇప్పుడు ఎంతోమందిలో రగులుతున్న ప్రశ్న ఇదే! అయితే.. తాను ఎంపీగా గెలిస్తే.. పసుపు బోర్డు, మద్దతు ధర సాధిస్తానని బాండ్ పేపర్ రాసిచ్చారు అర్వింద్. అప్పట్లో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోలేదని, ఎంపీ పదవికి రాజీనామా చేసి, తమతో కలిసి ఉద్యమించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పసుపు మద్దతు ధర కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రైతులు కోరారు. ఢిల్లీలో రైతుల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని నాలుగు రోజుల పాటు రహదారి దిగ్బంధనం కొనసాగిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొస్తాయని పలువురు అన్నదాతలు అభిప్రాయ పడుతున్నారు.
ఏపీలాగా ధర నిర్ణయించాలి..
పసుపు రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.6850 ధర నిర్ణయించింది. ఆ రేటు పసుపుకు వచ్చే విధంగా చూస్తున్నారు. మార్కెట్‌లో క్వింటాలు 4వేల నుంచి 5500 రూపాయల మధ్య అమ్మకాలు జరిగినా తహసీల్దార్ సర్టిఫై ద్వారా మిగతా డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని రైతులు తెలిపారు. అదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం ధర నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయిస్తే వ్యాపారులు ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తారని అన్నదాతలు చెబుతున్నారు.
పసుపు రైతుపై కరోనా ప్రభావం..
దేశంలోని ఇతర రాష్ట్రాలకు నిజామాబాద్ పసుపు సరఫరా అవుతోంది. చైనా, దుబాయి, మస్కట్, ఒమన్‌తో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. చైనాలో కరోనా వైరస్ ప్రభావంతో ఆ దేశానికి ఎగుమతులు నిలిచిపోయాయి. భారీగా ఆర్డర్లు వచ్చే స్థాయి నుంచి అసలు ఆర్డర్లు వస్తాయా? రావా అనే పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్ నుంచి ప్రతి సంవత్సరం చైనాకే ఎక్కువగా ఎగుమతి చేస్తారు.
ఆ మాటలన్నీ నీటి మీద రాతలేనా?
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎన్ని చెప్పినా పసుపు మద్దతు ధరపై దృష్టి పెట్టడం లేదు. పసుపు బోర్డు, మద్దతు ధరపై ఏళ్ళ తరబడి హామీలు ఇచ్చినా ఫలితం మాత్రం లేదు. ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపడం లేదు. మద్దతు ధర ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించినా దాని ఫలితం సంవత్సరం తరువాతనే తేలనుంది.
ఈ-నామ్ ఉన్నా.. ప్రయోజనం సున్నా!
వ్యవసాయ మార్కెట్‌లో ఈ-నామ్ ఉన్నా ప్రయోజనం లేదు. జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేయకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. ఇక్కడి వ్యాపారుల వద్దనే గత సంవత్సరం స్టాక్ ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం లేదు.
మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించాలి
రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో రైతులు పసుపు సాగు చేశారు. ఎకరానికి రూ.లక్ష, గరిష్ఠగా రూ.1.25 లక్షల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. రాష్ట్రంలో సగటున ఎకరానికి 20 క్వింటాళ్ల లెక్కన 20 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి వస్తుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పసుపు క్రయవిక్రయాలు జోరుగా సాగుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వమే సెంటర్లు ఏర్పాటు చేసి పసుపు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపితే ప్రైవేటు ట్రేడర్లు దారికొస్తారని, మార్కెట్లో ధర స్థిరంగా ఉంటుందనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. తమ తదుపరి కార్యాచరణను ఈనెల 20న ప్రకటిస్తామని రైతు సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది. దశలవారీ ఉద్యమం చేపట్టి మద్ధతు ధర సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేసింది.
ఢిల్లీ రైతుల స్ఫూర్తితో రోడ్డెక్కడం గర్వకారణం : కె.నాగేశ్వర్, ప్రొఫెసర్
అంబానీ, అదానీలు వచ్చి క్వింటాలుకు రూ.15వేలు చొప్పున పసుపు పంటను కొనుగోలు చేస్తే మాకేమీ అభ్యంతరం లేదు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టంలో మద్దతు ధర అంశం లేకపోవడంతో కార్పొరేట్ శక్తుల ఆగడాలు పెచ్చుమీరుతాయి. రైతుకు, కంపెనీకి మధ్య పేచీ వస్తే కోర్టుకు పోవద్దని కేంద్ర వ్యవసాయ చట్టాల్లో నిబంధన పెట్టడం ఏంటి?. కోర్టుకు పోవద్దని చట్టాలు తేవడం హేయమైన చర్య. నూతన సాగు చట్టాలతో ఎవరైనా.. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఎంతైనా.. ఉత్పత్తులు నిల్వ చేసుకునే అవకాశం కల్పించామనడం శుద్ధ అబద్ధం. రైతుల నుంచి తక్కువ ధరకు పంటలు కొని, ధర ఎక్కువ వచ్చినప్పుడు అమ్ముకునేందుకు కార్పొరేట్ సంస్థల లాభం కోసం చట్టాలను తెచ్చారు. ఢిల్లీలో రైతుల స్ఫూర్తితో ఇందూరు పసుపు రైతులు రోడ్డెక్కడం గర్వంగా ఉంది.