రాష్ట్రంలో ప్రభుత్వానికి, ఈసీకి మధ్య ‘స్థానికం’ పంచాయతీ ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. పదవీ విరమణ చేసే లోగా ఎలాగేనా స్థానిక ఎన్నికలు జరిపించి తీరాలని ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ భావిస్తుండగా.. ఆయన పదవీ కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలకు వెళ్లకూడదని ప్రభుత్వం కూడా పట్టుదల ప్రదర్శిస్తోంది. ఎన్నికల కమిషన్ కు ఏమాత్రం సహకరించకూడదని నిర్ణయించుకుంది. ఎన్నికల విధుల నిర్వహణకు తాము సిద్ధంగా లేమంటూ ఉద్యోగుల చేతా చెప్పించింది. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగలేదు. ఇలాంటి స్థితిలో ఈసీ.. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసేసింది. ఈసీ వైఖరిపై ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈసీ వైఖరిపై ప్రభుత్వం కోర్టు మెట్లెక్కింది. తరువాత ఏం జరగబోతోంది? కోర్టు ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతోంది? మరి.. ఉద్యోగుల సహకారం లేకుండా ఈసీ.. ఎన్నికలు నిర్వహించగలదా? నోటిఫికేషన్ ను తోసిరాజని ప్రభుత్వం వ్యవహరించగలదా? ఈ ప్రశ్నలు ప్రస్తుతం అందరి మదినీ తొలుస్తున్నాయి.
విచారణ కూడా అనవసరం
గత నెలలో కేరళలో స్థానిక ఎన్నికల వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే చర్చనీయాంశమైంది. కేరళ ఎమ్మెల్యే పీసీ జార్జ్ దాఖలు చేసిన ఈ పిటిషన్.. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. దీనిపై విచారణ జరిపేందుకు ధర్మాసనం అంగీకరించలేదు. కొవిడ్ బాధితులు, 65 ఏళ్లకు పైబడిన పౌరులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని కేంద్ర 27/ఏ నిబంధనను సవరిస్తూ నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేసిన ఆ ఎమ్మెల్యే.. దాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం పాటించడంలేదన్నారు. అయితే.. దీనిపై వాదనలు వినడానికి సుప్రీం ధర్మాసనం ఆసక్తి చూపలేదు. ఇప్పుడు కూడా దాదాపు అలాంటి పరిస్థితే ఏపీలోనూ వచ్చింది. కాకపోతే.. ఇక్కడ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేమంటూ పిటిషన్ దాఖలు చేయబోతోంది. మరి ఈ పరిస్థితుల్లో కోర్టు దీనిపై ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Must Read ;- ప్రభుత్వం సహకరించకుండా స్థానిక ఎన్నికలు సాధ్యమా?
ఉద్యోగులు సహకరిస్తారా?
నిజానికి ఉద్యోగులు సహకరించకుంటే.. ఈసీ ఏమీ చేయలేదు. ఎందుకంటే.. అది స్వయం ప్రతిపత్తి గల సంస్థే అయినప్పటికీ.. దానికంటూ ఓ వ్యవస్థ లేదు. ఈసీ ఎక్కడ ఎన్నికలు నిర్వహించాలన్నా.. అక్కడి స్థానిక ఉద్యోగుల మీదే ఆధారపడక తప్పని పరిస్థితి. అలాంటప్పుడు.. ఉద్యోగుల సహకారం లేకుండా ఎన్నికల నిర్వహణ దాదాపు అసాధ్యం. ప్రస్తుతం జగన్ సర్కార్.. దీన్నే ఆయుధంగా మలచుకుంది. ఎన్నికలకు ససేమిరా అంటోంది. మరి ఎన్నికల కమిషన్ విధులకు ప్రభుత్వం ఆటంకం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం అన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలియంది కాదు.
స్థానిక ఎన్నికల వాయిదాకు ఏపీ ప్రభుత్వం చేయని ప్రయత్నాలు లేవు. మొన్నటి వరకు కరోనా సాకు చెప్పిన జగన్ సర్కార్ ఇప్పుడు వ్యాక్సినేషన్ అడ్డొస్తోందంటోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రులే కాదు సీఎస్ మొదలుకొని ఉద్యోగ సంఘాల నేతల వరకు ఒక్కటే మాట. స్థానిక ఎన్నికలు వద్దంటే వద్దని. పంచాయతీ ఎన్నికలకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇలా నోటిఫికేషన్ విడుదల చేశారో లేదో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించలేమంటూ సీఎస్ ఆధిత్యానాథ్ తేల్చి చెప్పారు. దీనిపై ఇప్పటికే హైకోర్టు మెట్లెక్కిన జగన్ సర్కారు.. ఎన్నికల కమిషన్ ప్రొసీడింగ్స్పై ముందు హైకోర్టు, కుదరకపోతే సుప్రీంకోర్టులోనైనా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఏపీ సర్కార్ వాదన ఎంత వరకు నెగ్గుతుంది అన్నది ప్రశ్నార్థకమే!
Also Read ;- పల్లెల్లో కోడ్, పనులు ఆపండి : నిమ్మగడ్డ మరో లేఖ