ఆరుగాలం కష్టపడి పంట పండించే అన్నదాతలకు అవమానం జరిగింది. సాధారణంగా బ్యాంకు అప్పులు చెల్లించకపోతే ఒకటి రెండు సార్లు నోటీసులు ఇచ్చి, ఒత్తిడికి గురి చేస్తుంటారు. కానీ మెదక్ జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు బ్యాంక్ అధికారులు. బ్యాంకు అప్పు తీర్చనందుకు బ్యాంకు ఎదుట ఫ్లెక్సీకట్టి, వాటిపై ఫొటోలు పెట్టారు. ఫ్లెక్సీలపై ఫొటోలు పెట్టి పరువు తీస్తారా పాపన్నపేట రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా అవమానించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల రైతులు కొంతమంది, డీసీసీబీలో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నారు. భూములను కుదువ పెట్టి ఆ బ్యాంకులో అప్పు చేశారు. సరైన వర్షాలు లేక, అప్పటికే అప్పుల భారం ఉండటంతో రైతులు రుణాలు చెల్లించలేకపోయారు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకోని బ్యాంకు అధికారులు ఫ్లెక్సీలు పెట్టి ప్రదర్శించింది. ఈ సంఘటనపై రైతు సంఘాలు భగ్గుమన్నాయి. బ్యాంకు ఎదుట ఫొటోలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.