మనిషికి పంచ జ్ఞానేంద్రియాలు ఎలానో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆ ఐదుగురూ అలానే. వారే మహానటులు ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు. తెలుగు సినిమా చరిత్ర పుటలను తిరగేయాల్సి వస్తే అందులో వీరి పేర్లు సువర్ణాక్షరాలతోనే రాయాల్సి ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఘట్టమనేని శివరామకృష్ణది మూడో స్థానం.. ఆఖరి తారగా నేల రాలింది మాత్రం ఈరోజే. మహామహులు ఏలిన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎక్కడో మారుమూల ఊరైన బుర్రిపాలెం నుంచి మద్రాసులో అడుగుపెట్టి తనదైన ముద్రను మిగల్చడంలో కృష్ణ తనకు తానే సాటి.
సూపర్ స్టార్ అనే పదం కృష్ణ అనే పేరుకు ముందు చేరడం వల్ల ఆ పదానికే వన్నె చేకూరింది. ఆయన అసాధ్యుడే కాదు అనితర సాధ్యుడు కూడా. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, పద్మాలయ స్టూడియో అధినేతగా, ప్రజానేతగా.. ఇలా ఒక్కటేమిటి బహుముఖ ప్రజ్ఞ ఆయనకే సొంతం. సూపర్ తార నేల రాలడంతోనే తెలుగు సినిమాకు శుభం కార్డు పడింది. మళ్లీ కొత్త సినిమా చరితకు శుభారంభం పలకాల్సిందే.
ఇదీ కృష్ణ చరిత..
హీరోగా 350కి పైగా సినిమాలు, మల్టీస్టారర్ సినిమాలు 50, ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు 25, త్రిపాత్రాభినయం 7, దర్శకుడిగా 16 సినిమాలు, ఆయన హీరోయిన్లు 80 మంది, విజయనిర్మలతో 50, జయప్రదతో 43, శ్రీదేవితో 31, కేఎస్సార్ దాస్ దర్శకత్వంలో 31 సినిమాలు ఇదీ కృష్ణ జీవితం. 1965 నుంచి 2009 వరకు 44 ఏళ్లపాటు విరామం లేకుండా నటించిన ఏకైక హీరో కృష్ణ.
మొత్తం 105 మంది దర్శకులతో ఆయన పనిచేశారు. తమిళంలోకి డబ్ అయిన సినిమాలు 20, హిందీలోకి డబ్ అయిన సినిమాలు పది ఉన్నాయి. తెలుగు నాట 2500 అభిమాన సంఘాలున్న ఏకైక హీరో. 1972లో ఒక హీరో నటించిన సినిమాలు 18 ఉన్నాయంటే నమ్మగలమా. ఆ హీరో ఒక్క కృష్ణ మాత్రమే. విశ్రాంతి లేకుండా మూడు షిఫ్టుల్లో పనిచేశారు. ఆయన మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒక దిగ్గజాన్ని కోల్పోయిందనడంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు.











