కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో అనేక పరిశ్రమలు ఇబ్బందుల్లో పడ్డాయి. ప్రభుత్వం నుండి తగిన సహాయం అందక కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి కూడా. అలాగే మన దేశంలో కూడా పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోయాయి. ముఖ్యంగా మన దేశంలో సినీ పరిశ్రమ బాగా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. గత ఆరు నెలలుగా అనేకమంది స్టార్ హీరోల సినిమా షూటింగ్స్ మధ్యలోనే ఆగిపోయాయి. అప్పులు చేసి సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది.
అందుకనే నిర్మాతలను కాపాడుకోవడానికి హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, కళాకారులు తమ పారితోషికంలో 30 శాతం తగ్గించుకోవాలని సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడు, ప్రముఖ దర్శకుడు భారతీ రాజా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నిర్మిస్తున్న సినిమాల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయి పెట్టిన పెట్టుబడికి వడ్డీలు కట్టలేక కష్టాల్లో ఉన్న నిర్మాతలను తక్షణమే ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు భారతీ రాజా.
అదే టాలీవుడ్ లో నటీనటులు స్వచ్చందంగా 30 శాతం పారితోషికం తగ్గించుకుంటున్నట్లు ప్రకటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసారు. మనం కూడా అదే విధంగా చేసి మన ఇండస్ట్రీని కాపాడుకోవాలని భారతీ రాజా కోరారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు ప్రారంభమైనా కరోనా నిబంధనలను ఖచ్చితంగా దర్శకనిర్మాతలు పాటించాలని ఆయన తెలిపారు. భారతీ రాజా చేసిన విజ్ఞప్తిపై కొందరు సినీ ప్రముఖులు స్పందించారు.
భారతీ రాజా చేసిన ప్రకటన నిర్మాతలపాలిట వరంలా మారనున్నదని అభివర్ణించారు. ఇప్పటికే కరోనా కారణంగా షూటింగ్ లు ఆగిపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న నిర్మాతలకు భారతీ రాజా చేసిన ప్రకటన భారీ ఊరటను ఇస్తుందని వారు తెలిపారు. ప్రతీ ఒక్క కళాకారుడు స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ పారితోషికంలో 30 శాతం తగ్గించుకుంటే నిర్మాతలకు చాలా మేలు చేసివారు అవుతారని వారంటున్నారు.