Finance Minister Harish Rao Spills In Etela Rajender Own Village :
అదేంటో గానీ.. ప్రత్యర్థి ఇలాకాలో అడుగుపెడితేనే విజయం సాధించినట్లుగా చాలా మంది ఫీల్ అవుతుంటారు. ప్రత్యర్ధి కోటలో అడుగు పెట్టగానే విజయం సాధించినట్టు కాదు కదా. అసలు ఫైట్ జరిగితే కదా.. ప్రత్యర్ధిపై విజయం సాధించామో, అపజయం పాలయ్యామో తేలేది. అసలు పోటీకి ఇంకా ముహూర్తమే ఖరారు కాకున్నా.. ఎందుకో గానీ హుజూరాబాద్ బరిలో తాను గెలిచిపోయినట్లుగా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ అప్పుడే సంబరాలు మొదలుపెట్టేసింది. ఓ వైపు ఓటమి భయంతో కొత్త పథకాలు వరుసగా ప్రకటిస్తున్న టీఆర్ఎస్ సర్కారు.. హుజూరాబాద్ లో అడుగుపెట్టడమే తరువా సంబరాల మోడ్ లోకి వెళ్లిపోతోంది. ఇందుకు నిదర్శనంగా మంత్రి హోదాలో హరీశ్ రావు తువ్వాలు తిప్పుతూ హుషారైన పాటకు ఊగిపోయారు.
ఈటల స్వగ్రామంలో చిందులు
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకున్న కేసీఆర్ మేనల్లుడు, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు హుజూరాబాద్ లో నాన్ స్టాప్ గా పర్యటనలు సాగిస్తున్నారు. మొన్నామధ్య ఢిల్లీలో పార్టీ కార్యాలయం భూమి పూజకు అందరూ తరలివెళ్లినా.. హరీశ్ మాత్రం హుజూరాబాద్ లోనే ఉండిపోయారు. తాజాగా సోమవారం నాడు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాలుపంచుకున్న హరీశ్.. రాత్రయ్యేసరికి మాజీ మంత్రి, టీఆర్ఎస్ ప్రత్యర్థి, హుజూరాబాద్ ఉప ఎన్నికకు కారణమైన ఈటల రాజేందర్ స్వగ్రామం కమలాపూర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గాయకుడు సాయిచందు ‘గులాబీ జెండా’అంటూ హుషారైన పాటను అందుకుంటే.. ఆ పాటకు అనుగుణంగా మంత్రి హరీశ్ రావు తనలోని తువ్వాలును తీసి ఊపుతూ చిందులు తొక్కినంత పనిచేశారు. ఇక హరీశ్ రావు వెంట అక్కడికి వెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ కొంప కూల్చే యత్నంలో అడ్డంగా బుక్కై కార్యం ముగియకముందే టీఆర్ఎస్ కండువా కప్పుకున్న పాడి కౌశిక్ రెడ్డిలు.. ఓ రేంజిలో ఊగిపోయారు.
చతికిలబడరు కదా
హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన సమయంలో పోటీ టీఆర్ఎస్, ఈటల మధ్యేనన్నట్లుగా పరిస్ధితి ఉండేది. అయితే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపికయ్యాక అక్కడ ముక్కోణపు పోటీ తప్పేలా లేదు. టీఆర్ఎస్, బీజేపీలు కొట్టుకుంటే.. మధ్యలో ఆ సీటును కాంగ్రెస్ ఎగురవేసుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే.. టీఆర్ఎస్ నేతలు ఇలా డ్యాన్సులేస్తున్న దృశ్యాలు చూస్తుంటే.. ఈ చిందులు ఎన్నికలు ముగిశాక కూడా కొనసాగుతాయా? అన్న రీతిలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. అంతేకాకుండా ఉన్న హుషారంతా ఎన్నికలకు ముందుగానే ప్రదర్శించి సరిగ్గా ఎన్నికలు మొదలయ్యాక టీఆర్ఎస్ నేతలు చతికిలబడరు కదా అంటూ కూడా సెటైర్లు పడిపోతున్నాయి.