ఏపీలో అన్ని వర్గాలకూ నష్టం వాటిల్లేలా జగన్ సర్కారు ప్రజాకంటక నిర్ణయాలు తీసుకుంటోందని చాలా కాలం నుంచే టీడీపీ వాదిస్తోంది. టీడీపీ వాదనలో నిజముందన్నట్లుగా జగన్ సర్కారు ఇటీవలి కాలంలో పలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంది. చివరాఖరు అన్నం పెట్టే రైతన్నకు కూడా నష్టం కలిగేలా జగన్ సర్కారు వ్యవహరిస్తోంది. జగన్ సర్కారు తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలపై వరుసగా ఐదు రోజుల పాటు ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరిట టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పోరు బాట పట్టనున్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న చంద్రబాబు మంగళగిరి పరిధిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రైతు కోసం తెలుగుదేశం పోరుబాటలో అనుసరించాల్సిన కార్యాచరణను చంద్రబాబు ప్రకటించారు.
ఐదు రోజులు.. ఐదు జోన్లు
రైతు కోసం తెలుగుదేశంలో భాగంగా రాష్ట్రంలోని ఐదు జోన్లలో ఐదు రోజుల పాటు నిరసనలను కొనసాగించనున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. తొలి రోజైన మంగళవారం రాయలసీమ జోన్ లో నిరసనను ప్రారంభించనున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు. రైతులకు జగన్ వెన్నుపోటు పొడిచారని, రైతులకు ఇచ్చే సబ్సిడీలు నిలిచిపోయాయని, పెట్టుబడి వ్యయం రెట్టింపైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి పరిస్థితుల్లో కౌలు వ్యవసాయం చేసే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. వ్యవసాయాన్ని పండగ చేస్తానని ప్రకటనలు గుప్పించిన జగన్.. రాష్ట్రంలో సాగు చేయాలంటేనే అన్నదాతలు హడలిపోయే పరిస్థితులను కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
ఇప్పటికే పార్టీ శ్రేణులను ఫుల్ యాక్టివేట్ చేయడంలో సఫలమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. జగన్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ సాగుతున్నారు. లోకేశ్ మార్కు నిరసనలతో టీడీపీ శ్రేణులు మంచి జోష్ లో ఉన్నాయి. ఇలాంటి కీలక తరుణంలో పార్టీ అధినేతగా చంద్రబాబు కూడా నేరుగా రంగంలోకి దిగుతున్న వైనం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేదనన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అంతేకాకుండా జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న సామాన్య జనం కూడా టీడీపీతో కలిసి నిరసనల్లో పాలుపంచుకుంటున్న వైనం ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ నేపథ్యంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంతో బరిలోకి దిగుతున్న చంద్రబాబుకు కూడా పార్టీ శ్రేణుల నుంచే కాకుండా సాధారణ జనం నుంచి కూడా భారీ స్పందన ఖాయమన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.