సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉంది. ‘కాదువాకుల రండు కాదల్, మూక్కుత్తి అమ్మన్ , అన్నాత్తే’ సినిమాలను ఏకకాలంలో ట్రాక్ ఎక్కించిన అమ్మడు ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టుకుంది. సినిమా పేరు ‘నెట్రిక్కణ్’(మూడో కన్ను). ‘గృహం’ ఫేమ్ మిలింద్ రౌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్నాడు. మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయనతార అంధురాలిగా నటిస్తోంది. ఇటీవల ‘నెట్రిక్కణ్’ లుక్ ను సమంత అక్కినేని, గౌతమ్ మీనన్, అనిరుధ్ రవిచంద్రన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో అంధురాలి గెటప్ లో నయనతార షాకిస్తోంది. తలకి రక్తం కారుతుండగా.. చేతిలో ఒక ఆయుధంతో ఎవరినో అటాక్ చేయడానికి రెడీ గా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రమాదంలో కంటిచూపు కోల్పోయిన పోలీసాఫీసర్ గా నయనతార నటిస్తోన్నట్టు తెలుస్తోంది. ఎలాంటి పాత్రనైనా ఛాలెంజింగ్ గా తీసుకొని రక్తికట్టించే నయనతార అంధురాలిగా ఎలా అభినయిస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మరి ఈ సినిమా నయన్ కు ఏ రేంజ్ లో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.











