‘వకీల్ సాబ్’ తర్వాత విడుదలయ్యే పవన్ కళ్యాణ్ సినిమా మీద స్పష్టత వచ్చేసింది. ‘ఖుషి’ నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు క్రిష్ తో రూపొందించే ‘విరూపాక్ష’ ఫస్ట్ లుక్ ను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు విడుదల చేశారు. నిజానికి ఇది పవన్ కు 26వ సినిమానే అవుతుంది. కానీ సంఖ్య పరంగా 27 అవుతుంది. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ లో ఆయన చేసింది ప్రత్యేక పాత్ర మాత్రమే.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ చూస్తే ఇది చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అనేది అర్థమవుతోంది. దీనికి బుర్ర సాయిమాధవ్ రచన చేస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్ర పోషించనుంది. మొఘలుల కాలం కథ కావడంతో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషాల్లో విడుదల చేయనున్నారు. పవన్ లుక్ చేస్తే రాబిన్ హుడ్ తరహా పాత్రేనని స్పష్టమవుతోంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ దీనికి ఫైట్స్ అందించనున్నారు.