బాలీవుడ్ లో తొలి వెలుగులు మన తెలుగు వాడివే. అతనే పైడి జైరాజ్ నాయుడు. ఒకవిధంగా ఇండియన్ సినిమాకి తొలి సూపర్ స్టార్ జైరాజేనని అనాలి. సినిమా రంగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి తెలుగు నటుడు కూడా పైడి జైరాజే. తెలంగాణలోని కరీంనగర్ నుంచి ముంబయికి వెళ్లి సూపర్ స్టార్ గా ఎదిగాడు జైరాజ్. ఈ నెల 28వ తేదీ జైరాజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం లియో న్యూస్ కోసం. సినిమా పుట్టి తొమ్మిది దశాబ్దాలు. ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో హిందీ చిత్రసీమ ఇచ్చిన గుర్తింపు అతనికి తెలుగు పరిశ్రమ నుంచి మాత్రం రాలేదని అనడంలో అతిశయోక్తి లేదు. సినిమా రంగంలోకి వచ్చి బాగా డబ్బు సంపాదించుకున్న నటులే మనకు గుర్తున్నారుగానీ, అక్కడ వైభోగంగా వెలిగి చివరి నిమిషంలో ఆర్థికంగా దెబ్బతిన్న నటుల ప్రతిభ మాత్రం వెలుగులోకి రాకుండా పోతోంది.
సినిమా తొలి స్వర్ణయుగంలోకి వద్దాం..
మూకీల కాలం నుంచి టాకీ కాలం వరకూ సినిమాకు ఓ స్వర్ణయుగం. జైరాజ్156 సినిమా హీరో. డిమాండు తగ్గాక క్రమేపీ క్యారక్టర్ ఆర్టిస్టుగా మారి కూడా మరో 200 పైచిలుకు చిత్రాలు చేశారు. హిందీ, మరాఠీ, పంజాబీ, గుజరాతీ చిత్రాల్లోనూ ప్రతిభ చూపారు. 1909 సెప్టెంబరు 28న ఆయన కరీంనగర్ లో పుట్టారు. అచ్చుతయ్య, ఆండాలమ్మ తల్లిదండ్రులు. ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడు జయరాజ్. నిజానికి ఆయన పేరు జయరాజ్ నాయుడు. అన్నల పేర్లు సుందరరాజ నాయుడు, దీనదయాళ్ నాయుడు. మరో విషయం ఏమిటంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు జైరాజ్ కు మేనత్త. జైరాజ్ తండ్రి నిజాం ప్రభుత్వంలో పనిచేసేవారు. అతని చదువు సంధ్యలన్నీ రిషి వ్యాలీ, హైదరాబాద్ లోనే జరిగాయి.
నిజాం కాలేజీలో డిగ్రీ పట్టా తీసుకున్నారు. జైరాజ్ కు చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. కాలేజీలో చదివే టప్పుడే షేక్స్పియర్ నాటకాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. సినిమా తొలి రోజుల్లో ఉన్నపుడు వాటిలో నటించాలన్న కోరిక చెలరేగింది. మంచి అందగాడు, చక్కటి ఎత్తు, నాటకాల అనుభవం ఉండనే ఉంది. సినిమాల్లోకి వెళతానని అంటే పెద్దలు ఒప్పుకోలేదు. ఏమైనా సరే ఇంజినీరు అవ్వాల్సిందే అన్నారు. దాంతో అందరి లాగానే ఇంట్లో చెప్పపెట్టకుండా బొంబాయి చెక్కేశాడు. అప్పటికిందా తెలుగు టాకీలు ప్రారంభం కాలేదు. ఉన్న అవకాశమల్లా హిందీ చిత్రరంగమొక్కటే. బాంబేలో అవకాశాలు రావాలంటే పలుకుబడి ఉన్నవాళ్లకే వచ్చేవి. జైరాజ్ చెప్పకుండా వెళ్లిపోయాడనే కోపంతో ఇంట్లోవాళ్లు పట్టించుకోలేదు. దాంతో సినిమా కష్టాలన్నీ జైరాజ్ కు తప్పలేదు.
1930 లో తొలిసారిగా ” స్పార్క్లింగ్ యూత్ ” అనే మూకీ చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో ” ట్రయంఫ్ ఆఫ్ లవ్ ” అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. జైరాజ్ మొత్తం 11 మూకీ చిత్రాల్లో నటించారు. జయరాజ్ ను హిందీ వాళ్లే తప్ప మన తెలుగు వాళ్లు ఎందుకు గుర్తించ లేకపోయారు? మీడియా కూడా ఆయన మీద ఎందుకు శీతకన్ను వేసింది? ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలే. కరీంనగర్ లో కుటుంబ నేపథ్యం తెలుసుకుంటే అనేక ఆశ్చర్యకర విషయాలు మనకు తెలుస్తాయి. దర్శకుడిగానూ జైరాజ్ ప్రతిభ మనకు కనిపిస్తుంది. 1945 డిసెంబరు 14న విడుదలైన హిందీ చిత్రం ‘ప్రతిమ’కు ఆయనే దర్శకత్వం వహించారు. బాంబే టాకీస్ పతాకంపై రూపొందిన ఈ సినిమాలో దిలీప్ కుమార్, స్వర్ణలత, ముంతాజ్ ఆలీ, షా నవాజ్ నటించగా అరుణ్ కుమార్ ముఖర్జీ సంగీతం అందించారు.

సినిమా కష్టాలు తప్పలేదు
సినిమా పుట్టినప్పటి నుంచి సినిమా కష్టాలు అనే మాట కూడా పుట్టినట్టుంది. జైరాజ్ ముంబయి వెళ్లి చివరికి కూలిపని కూడా చేయాల్సి వచ్చింది. మొదట నావీలో చేరదామనుకున్నాడు. శారదా ఫిలిం కంపెనీలో స్టంట్ మాస్టర్‌గా చేశారు. కెమెరాలు సర్దడం, సెట్టింగులు, లేబరేటరీ పనుల్లో సహాయం లాంటి చిల్లర పనులు చేశాడు. మనసులో నటుడవ్వాలన్న బలమైన కోరిక ఉంది. జైరాజ్‌ను త్వరలోనే అదృష్టం తలుపు తట్టింది. అదే ఏడాది శారదా ఫిలిం కంపెనీ నిర్మించే ‘జాగ్మతి జవాని’ అనే మూకీ చిత్రంలో హీరోకి స్నేహితుడుగా అవకాశం వచ్చింది. రెండో సినిమా ‘రసీలి రాణి’ ముందుగా విడుదలైంది. అదే జైరాజ్ తొలి చిత్రం మారింది. అందులో జైరాజ్‌ది హీరో పాత్ర. ఆ సినిమా విజయంతో 1931 వరకు 11 మూకీ చిత్రాల్లో హీరోగా నటించాడు. వా‘ట్రయాంగిల్ ఆఫ్ లవ్’, ‘మాతృభూమి’, ‘ఆల్ ఫర్ లవ్’, ‘ఫ్లైట్ ఇంటు డెత్’, ‘మై హీరో’ లాంటి హిట్లు వచ్చాయి. ఆ రోజుల్లో మూకీ నిర్మాణం ఎండలోనే జరిగేది. మూకీలు కావడంతో కేవలం హావభావాలకే ప్రాధాన్యం ఉండేది.
టాకీయుగంలో ఆయనే సూపర్ స్టార్
మూకీల తర్వాత టాకీ యుగం వచ్చింది. 1931లో తొలి హిందీ టాకీ ‘ఆలం ఆరా’ విడుదలయ్యాక జైరాజ్ 1932లో ‘షికారి’లో హీరోగా నటించారు. పులులు, సింహాలు, పాములు వంటి అడవి జంతువులతో నిర్మించిన ఈ చిత్రం బాగా ఆడింది. జైరాజ్‌కు ఉర్దూ భాషమీద మంచి పట్టు వుండడం, కంఠంలో గాంభీర్యం బాగా ప్లస్ అయ్యాయి. ఆ తర్వాత ‘మాయా జాల్’, ‘పతిత పావన్’, ‘ఔరత్ కా దిల్’ సినిమాల్లో హీరోగా చేశారు. 1937లో ‘తూఫాని ఖజానా’లో నటించిన తరవాత వచ్చిన ‘బాబి’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలా వరుసగా హిట్లే హిట్లు రావడంతో అతనే సూపర్ స్టార్ అయ్యాడు. హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత కూడా అతను నిరుత్సాహపడలేదు. తన రూటు మార్చుకున్నాడు. ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా చేయడానికి సిద్ధపడ్డాడు. అరవయ్యో దశకం నుంచి క్యారక్టర్ నటుడుగా రాణిస్తూ వచ్చారు. ‘బహారోం కి సప్నే’, ‘నీల్ కమల్’, ‘రాస్తే అవుర్ మంజిల్’ వంటి సినిమాలలో జైరాజ్ పోషించిన సహాయక పాత్రలు అజరామరాలు. అలాగే ‘దాన’, ‘మాసూం’ చిత్రాల్లో క్యామియో పాత్రలు అద్భుతంగా పోషించారు.
పాన్ ఇండియా నటుడు కూడా..
మన జైరాజ్ ను పాన్ ఇండియా నటుడు కూడా అనాల్సి ఉంటుంది. ఎందుకంటే తొలి రోజుల్లో సినిమా పరిధి కూడా ఎక్కువే. అప్పుడు జనానికి సినిమా ఓ వింత. నటులకు కూడా ఎంతో క్రేజ్ ఉండేది. సూపర్ స్టార్ గా ఎదిగిన జైరాజ్ ఆ తర్వాత అంతర్జాతీయ చిత్రాల్లో కూడా నటించారు. కె.ఎ.అబ్బాస్ రష్యా వారి సహకారంతో నిర్మించిన ‘పరదేశి’, ఎం.జి.ఎం. ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ‘మాయ’, ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్ నిర్మించిన ‘నైన్ అవర్స్ టు రామ’ ప్రధానంగా చెప్పుకోవాలి. మహాత్మా గాంధీ హత్యోదంతం నేపథ్యంలో నిర్మించిన ‘నైన్ అవర్స్ టు రామ’ సినిమాను భారత్‌లో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతించలేదు. ఇలాంటి వివాదాలకు కూడా జైరాజ్ కేంద్ర బిందువు అయ్యాడు. రాబర్ట్ మొర్లీ, జోస్ ఫెర్రర్ వంటి హాలీవుడ్ నటులతో నటించిన అనుభవం జైరాజ్‌ది.
1951లో దిలీప్ కుమార్, భరత్ భూషణ్, నర్గీస్ ముఖ్య తారాగణంగా జైరాజ్ ‘సాగర్’ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. లార్డ్ టెన్నిసన్ రాసిన ‘ఎనోఖ్ ఆర్డెన్’ అనే గేయాన్ని ఆధారంగా తీసుకొని జైరాజ్ ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా జైరాజ్‌తో జైరాజ్ నష్టాల్నే మిగిల్చింది. పంపిణీ దారుల వద్ద డబ్బు తీసుకోకుండా సొంత డబ్బు పెట్టుబడిగా పెట్టడం, సినిమా విడుదలలో అనుభవరాహిత్యం.. ఇవన్నీ జైరాజ్ ను దెబ్బతీశాయి. తన ఆఫీసును కూడా జైరాజ్ అమ్ముకోవలసి వచ్చింది. చేతులు కాలాక మళ్లీ నటన వైపు మొగ్గుచూపారు. దర్శకుడిగా ‘మాల’, ‘మొహర్’, ‘రాజ్ ఘర్’ సినిమాలు, ‘తానా-బనా’, ’కథా సాగర్’ వంటి రెండు టెలివిజన్ సీరియళ్లకూ రూపకల్పన చేశారు. మరాఠీ, గుజరాతీ చిత్రాల్లో కూడా నటించారు. మన నిర్మాతలకు మాత్రం జైరాజ్ ప్రతిభ పనికిరాలేదు.
క్రమశిక్షణలో ఎన్టీఆర్ మాదిరే..
మనకు తెలిసిన మహానాయకుడు ఎన్టీఆర్ కు ఎలాంటి క్రమశిక్షణ ఉందో అలాంటి క్రమశిక్షణే జైరాజ్ కు కూడా ఉండేదట. ఉదయం ఐదు గంటలకు లేచి రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోయేవారట. ఆయన పుస్తకాల పురుగు కూడా. వేలాది పుస్తకాలు సేకరించేవారు. వాటిని జీవితం చివరి దశలో వాటిని బొంబాయి, కలకత్తాలో ఉండే స్నేహితులకు, గ్రంథాలయాలకు పంచిపెట్టారు. ఆటలంటే ఆయనకు మహాఇష్టం. మన తారలు ఇప్పుడు క్రెకెట్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారుగానీ దీనికి బీజం వేసింది కూడా జైరాజే. తారలతో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించి అలా వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాల కోసం ఖర్చుపెట్టేవారు. ఇవే కాకుండా సంగీత, నృత్య కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. పృథ్వీరాజ్ కపూర్, జైరాజ్ కలిసి 1939లోనే ‘సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అనే సంస్థను ఏర్పాటుచేశారు. అలా పృథ్వీరాజ్ కపూర్ కుటుంబంతో జైరాజ్ మంచి సంబంధాలు ఉండేవి.
ఢిల్లీకి చెందిన సావిత్రి అనే పంజాబీ అమ్మాయితో జైరాజ్‌కు పెళ్లి జరిపించింది పృథ్విరాజ్ కపూరే. జైరాజ్‌కు ఇద్దరు కుమారులు, నలుగురు కూతుళ్లు. వారిలో తిలక్ రాజ్ ఇంజనీరుగా అమెరికాలో స్థిరపడగా, కూతుళ్లు నలుగురూ బొంబాయిలోనే పెళ్లిళ్లు చేసుకొని హోమ్ మేకర్స్‌గా స్థిరపడ్డారు. వారిలో ఇప్పుడు ఎవరూ మిగిలి లేరు. రాజకపూర్, షమ్మికపూర్, శశికపూర్‌లు జైరాజ్‌ని ‘పాపాజీ’ అని గౌరవంగా పిలుస్తూ తండ్రితో సమానంగా చూసేవారు. అశోక్ కుమార్ జైరాజ్‌కు మంచి స్నేహితుడు. 1980లో జైరాజ్‌కు భారత ప్రభుత్వం ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డును ఇచ్చి గౌరవించింది. నటుడుగా ఫాల్కే పురస్కారాన్ని అందుకున్న మొట్ట మొదటి తెలుగువాడు జైరాజ్. ఒక్క తెలుగువాడు కూడా ఈ విషయాన్ని ప్రచారం చేయకపోవడం మన దురదృష్టం. ఈ బహుమతి దక్కించుకున్న రెండవ తెలుగు హీరో అక్కినేని నాగేశ్వరరావు (1990). అంతేకాదు ఫిలింఫేర్ బహుమతులు ప్రవేశపెట్టడంలో కూడా ప్రధాన పాత్ర పోషించినవారు జైరాజ్. మహరాష్ట్ర ప్రభుత్వం జైరాజ్‌కు జీవిత సాఫల్య పురస్కారమిచ్చి గౌరవించింది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జైరాజ్ జీవన యానం మీద ఈ సంవత్సరమే ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించింది. జూలై 28న ఈ చిత్రాన్ని ఫిలిం భవన్‌లో తెలంగాణ ప్రభుత్వం విడుదలచేసింది. హిందీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో నిర్మించిన 356 చిత్రాల్లో జైరాజ్ నటించారు. ఆ రోజుల్లో అత్యధిక పారితోషికం అందుకున్న హీరో జైరాజ్. వాటిల్లో హీరోగా 156 చిత్రాలు, ఇతర సహాయ నటుడి పాత్రలలో 200 చిత్రాలు వున్నాయి. జైరాజ్ ఆగస్టు 11,2000న తన 91వ ఏట ముంబయిలో లో కన్నుమూశారు. అతని భార్య సావిత్రి అంతకు ఏడాది ముందే క్యాన్సర్ బారిన పడి మరణించడం జైరాజ్‌ని కుంగదీసిందని అంటారు.
జైరాజ్ నటుడిగా ఎంత సంపాదించారో లెక్కలేదు. బాంబేలో ఎన్నో బంగళాలు, ఇళ్ళ స్థలాలు ఉండేవి. కొడుకులు ఇద్దరూ దురలవాట్లకు లోనవడం ఇబ్బందులు తెచ్చిపెట్టింది. త్వరలోనే ఖజానా ఖాళీ అయిపోయింది. చివరకు తనుండే బంగ్లా మాత్రమే మిగిలింది. దాన్ని కూడా కొడుకు, కోడలు ఆక్రమించి జైరాజ్‌ని చీకటి గదికి పరిమితం చేశారట. ఆయన్ని నానా ఇబ్బందులకు గురిచేసేవారని అంటారు. కూతురు గీత కోర్టు కెళ్లి అన్న, వదినలను ఖాళీ చేయించి జైరాజ్‌ను ఆదుకుందని చెబుతుంటారు. కేసు కోర్టులో ఉన్నపుడు జైరాజ్ ‘యువరానర్.. నన్ను నా ఇంటిలో ప్రశాంతంగా మరణించే అవకాశం కల్పించండి’ అని జడ్జిని బతిమాలుకున్నాడని అంటారు. ఇలాంటి మహానటుడిని మనం గుర్తుంచుకోకపోవడానికి కారణం ఏమిటి? ఇలాంటి నటుల జీవితాల నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవలసి ఉంటుంది. ఇదండీ మన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన నటుడి జీవిత గాథ.. కాదు ఇది వ్యధ.











