ఏపీ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటికే లెక్కకు మిక్కిలి సలహదారులను నియమించుకున్న సీఎం జగన్.. వారికి భారీ మొత్తంలో ప్రజా ధనాన్ని వెచ్చిస్తున్నారు. భారీ వేతనాలతో పాటుగా అలవెన్సుల కింద కూడా భారీ మొత్తాలనే అందిస్తున్నారు. ఇటు పార్టీతో పాటు ఇటు తన కుటుంబం ఆధ్వర్యంలోని సాక్షి మీడియాలో పనిచేసిన కీలక వ్యక్తులను పెద్ద సంఖ్యలో ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్న జగన్ తీరుపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్నాయి. అయినా కూడా వాటినేమీ పట్టించుకోని జగన్.. తాజాగా తన సొంత సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగిని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. ఈ మేరకు ఏపీ సర్కారు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగుల సంక్షేమం కోసమట..
తాజాగా జగన్ సర్కారు నియమించుకున్న సలహాదారు వేరెవరో కాదు.. మొన్నటిదాకా ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ పొందిన చంద్రశేఖరరెడ్డి. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు చంద్రశేఖరరెడ్డిని సలహాదారుగా నియమిస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న చంద్రశేఖరరెడ్డి.. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సంక్షేమంపై జగన్‌కు సలహాలు ఇస్తారట. ఇప్పటికే ఉద్యోగుల సమస్యలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి డిమాండ్లను ఎప్పటికప్పుడు ఆయా ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం ముందు పెడుతూనే ఉన్నారు. వాటి పరిష్కారానికి దిక్కు లేదు గానీ.. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం సలహాలు ఇవ్వాలంటూ కొత్తగా చంద్రశేఖరరెడ్డిని జగన్ సర్కారు సలహాదారుగా నియమించుకున్న తీరుపై సెటైర్లు పడుతున్నాయి.
ఇక సజ్జలకు రెస్ట్ ఇస్తారా?
ప్రభుత్వం, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల మధ్య సంధానకర్తగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులు గానీ, ఉద్యోగ సంఘాల నేతలు గానీ.. ప్రభుత్వానికి ఏ మాట చెప్పాలన్నా.. ముందుగా సజ్జలకే చెప్పాలి. సజ్జలకు తెలియకుండా ఉద్యోగులు ఒక్క అడుగు కూడా ముందుకు గానీ, వెనక్కు గానీ వేయడానికి వీల్లేదన్న రీతిలో పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నామధ్య ప్రభుత్వానికి తెలియకుండా రెండు ఉద్యోగ సంఘాల నేతలు మీడియా సమావేశం పెడితే.. ఫోన్ ద్వారానే వారిని అక్కడి నుంచి పరిగెత్తించిన మాదిరిగా వ్యవహరించిన సజ్జల.. మొన్నటి జాయింట్ స్టాప్ కౌన్సిల్ మీట్‌లోనూ కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం సలహాలిచ్చేందుకు చంద్రశేఖరరెడ్డిని నియమించుకుంటే.. ఇక సజ్జల పక్కకు తప్పుకోవాల్సిందేనా? అన్న కోణంలోనూ సెటైర్లు పేలుతున్నాయి. అయినా సజ్జల ఉండగా.. చంద్రశేఖరరెడ్డే కాదు ఏ రెడ్డి వచ్చినా డమ్మీ పాత్ర వ్యవహరించాల్సిందేనన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.