యూపీఏ హాయాంలో కేంద్ర మంత్రిగా పని చేసిన వి. కిషోర్ చంద్రదేవ్ టీడీపీ విజయావకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇప్పటివరకూ టీడీపీలోనే ఉండగా.. తాజాగా రాజీనామా చేశారు. గత 2019 ఎన్నికల్లో అరకు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఐదేళ్లుగా టీడీపీలోనే ఉండి తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టీడీపీ నుంచి వెళ్లిపోతూ కూడా ఆయన ఆ పార్టీ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ దాదాపు 160 స్థానాలు గెలుస్తుందని ఆయన అంచనా వేశారు. వచ్చే ఎన్నికల కోసం టీడీపీ ఎవరితోనూ పొత్తుకు వెళ్లాల్సిన అవసరం లేదని కేవలం ఒంటరిగా బరిలో దిగితే చాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేన, బీజేపీతో కలిసి వెళ్లకపోయినప్పటికీ టీడీపీకి 160 స్థానాలను గెలిచే సత్తా ఉందని వ్యాఖ్యానించారు. అయితే, తాను టీడీపీ నుంచి ఎందుకు వైదొలుగుతున్నానో కూడా కిషోర్ చంద్రదేవ్ వివరించారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడడం వల్ల తాను ఆ పార్టీ పట్ల ఆకర్షితుడినై టీడీపీలో చేరానని అన్నారు. తాజాగా మళ్లీ టీడీపీ బీజేపీతో జతకట్టడం తనకు నచ్చడం లేదని చెప్పారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గానికి చెందిన కిశోర్ చంద్రదేవ్ గురువారం సాయంత్రం విలేకర్లతో మాట్లాడారు. బీజేపీతో పొత్తుకు టీడీపీ ప్రయత్నిస్తోందనే కారణంతోనే పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపానని పేర్కొన్నారు. అంతేకానీ, తనకు పార్టీ పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరనని స్వతంత్రంగా కూడా అరకు నుంచి పోటీచేయబోనని అన్నారు. ఒంటరిగా పోటీ చేయడానికి అరకు స్థానం సరైంది కాదని.. అందుకే తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే, కిషోర్ చంద్రదేవ్ వయోభారం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
కిషోర్ చంద్రదేవ్ 2019 ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ, వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. గతంలో కాంగ్రెస్ లో ఉండగా 5 సార్లు ఎంపీగా గెలిచారు. ఒకసారి రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు. యూపీఏ హాయాంలో 2011 నుంచి 2014 వరకూ పంచాయత్ రాజ్ మంత్రిత్వశాఖ మంత్రిగా పని చేశారు.











