ఎన్ని సార్లు చెప్పినా అబద్దం నిజం అయిపోదు. ఎంత దాచిపెట్టాలని చూసినా వాస్తవం వెలుగులోకి వస్తుంది. తన పాలనలో అంతా బాగుందని ప్రజలను నమ్మించడానికి ఏపీ సీఎం జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవన్నీ రివర్స్ అవుతున్నాయి. కళ్ల ముందు కనిపిస్తున్న విధ్వంసాన్ని చూస్తూ కూడా ముఖ్యమంత్రి చెప్పే కాకమ్మ కబుర్లు నమ్మడానికి జనాలైతే సిద్ధంగా లేరు. ఆ సంగతి జగన్‌కి అర్ధం అయిందో లేదో గానీ.. వైసీపీలో కార్యకర్తల దగ్గర్నుంచి.. నెంబర్ టూ వరకూ ప్రతి ఒక్కరూ పబ్లిక్ ముందే వాస్తవాలు ఒప్పకొంటున్నారు.. అధికార పార్టీ నాయకత్వంలో ఈ మార్పులకు కారణమేంటి.. ఎన్నికల ముందు సొంత మనుషులే జగన్‌పై రివర్స్ అవుతున్నారా..
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏపీ రహదారులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసా అంటూ పొరుగు రాష్ట్రాల్లో కథలు, కథలుగా చెప్పుకొంటున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో మాజీ సీఎం కేసీఆర్, ఏపీ రోడ్లనే ప్రచారాంశంగా మార్చారంటే.. జగన్ పాలన గొప్పతనం అర్ధం చేసుకోవచ్చు. ఎవరు ఏమన్నా, ఏమనుకున్నా బటన్ నొక్కడం తప్ప తనకు ఇంకో పని చేయడం రాదు అన్నట్లు మాట్లాడతారు ఏపీ సీఎం జగన్. పోలీసుల పహారాలో, పరదాల చాటున తిరిగే ముఖ్యమంత్రికి ప్రజల నుంచి ఎదురు ప్రశ్నలు ఎదురయ్యే ఛాన్స్ లేదు. ఆ అవకాశం కూడా ఎవరికీ ఇవ్వరు. అందుకే ఆయన ఏం చెప్పినా వినడమే తప్ప.. ఇందేదయ్యా అని అడిగే అవకాశం ఉండదు. కానీ మిగిలిన వైసీపీ నేతలకు అంత అదృష్టవంతులు కాదు. వాళ్లు జనాల్లోకి వెళ్లాల్సిందే. రోడ్ల మీద గుంతల్లో నిలబడి అంతా బాగుందని చెబితే.. జనం కుర్చీ మడత పెడతారో.
మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ యువనేత లోకేశ్‌ని ఎదుర్కోవడానికి తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు భారీ కసరత్తు చేస్తున్నారు. అక్కడ ఇప్పటికే ఒక అభ్యర్ధిని ప్రకటించినా.. ఆయన గెలుస్తారనే నమ్మకం లేక మరో కేండిడేట్ కోసం వెతుకుతున్నారు. జగన్ పాలనతో విసిగిపోయిన స్థానిక వైసీపీ నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పేసి, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మంగళగిరిలో పార్టీకి డిపాజిట్ కూడా దక్కదేమో అని వైసీపీ అధిష్ఠానంలో భయం మొదలైంది. ఏకంగా నెంబర్ టూ విజయసాయిరెడ్డి నియోజవకవర్గంలో దిగిపోయారు. గ్రామాల్లో తిరిగిన తర్వాత రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని ఆయనే ఒప్పుకోవాల్సి వచ్చింది.
అభివృద్ధి విషయంలో జగన్ ప్రభుత్వం ఎలాంటి మోసాలు చేస్తోందో.. బయటపెట్టారు మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇన్నాళ్లు ముఖ్యమంత్రికి ముఖ్య అనుచరుడిగా ఉన్న ఏఆర్‌కే, తనకు టికెట్ దక్కదని తేలడంతో సీఎం గట్టు బట్ట బయలు చేశారు. నియోజకవర్గం అభివృద్ధికి పైసా కూడా ఇవ్వలేదని చెప్పి పార్టీ గుడ్‌బై చెప్పారాయన. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. మంత్రి జోగి రమేశ్ ఎంత పట్టుబట్టినా.. వసంతకే మైలవరం టికెట్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. అయినా అక్కడి నుంచి పోటీ చేయడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆసక్తి చూపించడం లేదు. ఐదేళ్లలో చిన్న డెవలప్‌మెంట్ వర్క్ కూడా చేయకుండా జనంలోకి వెళ్లలేనని స్పష్టం చేశారు.
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును, గుంటూరు బదిలీ చేయాలని చూసిన జగన్‌కు పెద్ద షాకే తగిలింది. రాజధాని అమరావతిని నాశనం చేసిన పార్టీ టికెట్‌పై పోటీ చేస్తూ.. ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడగాలని ముఖ్యమంత్రిని మొహం మీదే అడిగారట. ఎంపీ ఎంత అభ్యంతరం చెప్పినా వినకుండా, పేట నుంచి మారాలని తాడేపల్లి ప్యాలెస్ ఆదేశించడంతో.. ఏకంగా పార్టీనే వదిలేశారు శ్రీకృష్ణదేవరాయలు. ఈ వ్యవహారంతో రాజధాని ప్రజలను మోసం చేశామనే అభిప్రాయం వైసీపీ నాయకుల్లో ఎంత బలంగా ఉందో అర్ధమవుతుంది.
చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌లను తిడితేనే వైసీపీ టికెట్ దక్కుతుందనే విషయం ఆ పార్టీ నేతల బయట పడింది. ప్రతిపక్ష నాయకులపై నోరు పారేసుకోవాలనే కండిషన్‌ను కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి వంటి వైసీపీ నాయకులు తప్పుబట్టారు. ప్రభుత్వ పనులు చేయడానికి ఒక్క కాంట్రాక్టరు కూడా ముందుకు రాని పరిస్థితిని గుర్తు చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు. ఇప్పటి వరకూ చేసిన పనులకే బిల్లులు రాకపోవడం వల్లనే.. కొత్తగా పని చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదని వివరిస్తున్నారు. వైసీపీ నాయకుల నుంచే ఇలాంటి ఆరోపణలు రావడం ఆ పార్టీకి పెద్ద మైనస్ అవుతోంది.
మాటకు ముందు నా ఎస్సీ, నా బీసీ అనే ముఖ్యమంత్రి జగన్ వాస్తవానికి వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు వ్యవహారంలో ఇప్పటి వరూ అణగారిన వర్గాలకే టికెట్లు నిరాకరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సొంత పార్టీ నాయకులే జగన్ పాలనలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్నా.. సీఎం మాత్రం తన హయాంలో బటన్‌తో బ్రహ్మాండం సృష్టించానని గొప్పలు చెప్పుకొంటున్నారు. వైసీపీ అధినేత మాటలకు, చేతలకు పొంతలేని పరిస్థితుల్లో ఏపీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో కుర్చీ మడతపెట్టి తీర్పు ఇస్తారని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ పరిశీకులు, ప్రజలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.