జనవరి వచ్చేసింది.. మరో పక్క సంక్రాంతి కూడా సమీపిస్తోంది. అందరూ సినిమా పండగ సమీపంలోనే ఉందనుకున్నారు. కానీ ఈసారి ప్రేక్షకులకు సినిమా పండుగ లేని వాతావరణమే కనిపిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా, మల్టీస్టారర్ సినిమా ట్రిపుల్ ఆర్ వాయిదా పడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి ప్రధానంగా కరోనా కేసులు పెరుగుతుండటమే కారణంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే.
ఈ జనవరి 7న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఓవర్సీస్ మార్కెట్లో టిక్కెట్లు కూడా అమ్ముడయ్యాయి. సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడదని రాజమౌళి కూడా ప్రకటించారు. అయితే ఈ సినిమా విడుదలకు ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది. బహుశా ఇవాళో, రేపో ఈ సినిమా విడుదలను వాయిదా వేయనున్నట్లు అధికారికంగా వార్తలు వచ్చే అవకాశం ఉంది. చిత్ర యూనిట్ కూడా ఈ సినిమా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ముంబై, చెన్నైలలో ప్రీరిలీజ్ ఈవెంట్లను కూడా నిర్వహించారు. ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ విడుదల కావలసి ఉన్నా నిర్మాతలను ఒప్పించి వాయిదా వేయించారు.
ఒకేసారి పెద్ద సినిమాలు విడుదల కావడం చిత్ర పరిశ్రమకు ఆరోగ్యకరం కాదనే ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా ట్రిపుల్ ఆర్ సినిమానే వాయిదా పడబోతోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇది పాన్ ఇండియా సినిమా కావడంవల్ల ఐదు భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. ఏదో విధంగా సినిమాను విడుదల చేసినా థియేటర్లకు జనం వస్తారో రారోనన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సినిమా దానికి తగ్గ వసూళ్లు సాధించాలంటే కనీసం రెండు వారాలైనా థియేటర్లలో ఆడాల్సి ఉంటుంది.
కరోనా కేసులతో పాటు, ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి చోట్లు ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు. ముంబైలో 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుస్తున్నాయి. ఈ సంక్రాంతికి విడుదల కావలసిన రాధేశ్యామ్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే అనుకోవచ్చు. ఒకవేళ బలవంతంగా సినిమాను విడుదల చేసినా జనం థియేటర్లకు రాకపోతే అనుకున్న స్థాయిలో వసూళ్లు ఉండవు. దాంతో అందరూ పునరాలోచనలో పడ్డారు. ఏప్రీల్ తర్వాతే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.











