కష్టాల్లో ఉన్న ఓ కుటుంబాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అర్థాంగి శోభ ఆదుకుని తన పెద్ద మనసు చాటుకున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తన భర్తను పోగొట్టుకున్న ఓ మహిళకు ఆర్థిక సహాయం చేసి చేయూతను అందించారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా తిరుమలాపూర్ గ్రామంలో ఇల్లు కూలిపోయి తిరుపతి అనే వ్యక్తి మరణించాడు. దీంతో అతని తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. అటు భర్తను, ఇటు ఇల్లును కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆ మహిళ.. తన ఇద్దరు పిల్లలు, అత్తమామలతో కలిసి మున్నూరు కాపు భవన్‌లో తలదాచుకుంటుంది.
ఆ కుటుంబ పరిస్థితి తెలిసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అర్ధాంగి శోభ చలించిపోయి ఆ కుటుంబానికి ఆర్థికసాయం చేయాలనుకున్నారు. అనుకోవడమే కాదు ఆ లక్ష రూపాయల సాయాన్ని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ ద్వారా ఆ కుటుంబానికి అందేలా చొరవ తీసుకున్నారు. అలాగే మిగిలిన దాతలు కూడా రూ.2లక్షలు సాయం చేయడంతో మొత్తం మూడు లక్షల ఆర్థిక సాయంను బాధిత కుటుంబానికి అందజేశారు. అలాగే ఆ కుటుంబానికి ప్రభుత్వం తరుపున డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.











