మనిషి కళ్లకు గాగుల్స్ ఎంత అవసరమో.. మనిషి మనుగడకు గూగుల్ అంత అవసరం అనడంలో అతిశయోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే గాగుల్స్ లేకపోయినా బతకొచ్చు.. గూగుల్ లేకపోతే మాత్రం కష్టం అనేలా పరిస్థితి తయారైంది.
మనం గూగుల్ చేతిలో బందీలమైపోయామా? మరో ప్రత్యామ్నాయ సెర్చ్ మనకు ఎందుకు లేదు? భవిష్యత్తులో నిన్నటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి? అనే ప్రశ్నలు మనకు ఇప్పుడు తలెత్తుతున్నాయి. తరచూ గూగుల్ సర్వర్లు మొరాయించడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. నిన్నటి పరిస్థితి తలచుకుంటే ఎంత కష్టం.. ఎంత నష్టం అనిపిస్తోంది. దీన్ని అంచనా వేయడం కూడా కష్టమే. అంతలా పెనవేసుకుపోయింది గూగుల్ తో మన బంధం. గూగుల్ కు ప్రత్యామ్నాయం మన దగ్గర ఎందుకు లేదు అనే ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేదు.
ఒకప్పుడు యాహూ, ఆర్కూట్, బింగ్, లాంటి సెర్చ్ ఇంజన్లు ఉండేవి. ఒక విధంగా చెప్పాలంటే గూగుల్ ధాటికి అవి తట్టుకోలేకపోయాయనే చెప్పాలి. డిసెంబరు 14వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి దాదాపు 45 నిమిషాల పాటు గూగుల్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీన్ని డౌన్ డిటెక్టర్ అని గూగుల్ ప్రకటించింది. జీమెయిల్, యూట్యూబ్, క్లౌడ్ సెర్చ్, కీప్, టాస్క్, హాంగౌట్స్ లాంటి ఎన్నో సేవలకు నిన్న అంతరాయం కలిగింది.
సోషల్ మీడియాలో కామెంట్ల వెల్లువ
నిన్నటి గూగుల్ సర్వర్ డౌన్ వ్యవహారంపై సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కొంతమంది వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. గూగుల్ సెర్చ్ లో నిన్న సాయంత్రం అంతా ఇదే కనిపించింది. గూగుల్ ట్రెండ్స్ లోనూ ఈ వ్యవహారం టాప్ లో కనిపించింది. దాదాపు 592 మిలియన్ల మంది సంప్రదింపులు జరిపినట్టు వెల్లడైంది. సామాన్య పౌరుడి మొదలుకుని బడా కార్పొరేట్ కంపెనీలు, బడా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు.. ఇలా గూగుల్ బాధితులు చాలామందే ఉన్నారు. ట్విట్టర్ లో గంట వ్యవధిలోనే గూగుల్ డౌన్ అనే హ్యాజ్ ట్యాగ్ వైరల్ అయ్యింది. ఈ తరుణంలో గూగుల్ సేవల మీద ఒక విధమైన అపనమ్మకం కూడా ప్రజల్లో కలిగింది.
వినియోగదారుకు గూగుల్ ఎన్ని క్షమాపణలు చెప్పినా ఏదో చిన్న వెలితి మాత్రం వినియోగదారుల్లో ఉండిపోయింది. ఇది ఏక వ్యక్తి పాలనలా అనిపిస్తోంది. ఒక సంస్థ వైఫల్యం మొత్తం వ్యవస్థను దెబ్బతీసేసింది. ఈ కారణంగా అనేక వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఒక్కరి ఆధిపత్యం ఉంటే ఇలాంటి తలనొప్పులు తప్పవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఇది ప్రమాద సంకేతమని కూడా భావిస్తున్నారు. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం గూగుల్, ఫేస్ బుక్, అమెజాన్, ఆపిల్ లాంటివి మరే ఇతర సంస్థలు అభివృద్ధి చెందే వీలు కల్పించలేదు. ఈ కారణంగా అనేక మంది వీటి చట్రంలో ఇరుక్కుపోతున్నారన్న అభిప్రాయం నెలకొంది.
ఏమిటీ సాంకేతిక సమస్య?
ఈ సాంకేతిక అంతరాయాన్ని నిర్వచించడం కష్టం. డేటాను ఒక ప్రదేశంలో నిల్వ చేయడం, పంపడంలో తేడా వస్తే ఇలాగే ఉంటుంది. ఓ దశాబ్దం క్రితం వరకూ ఇంటర్నెట్ అనేది బడా టెక్ కంపెనీలలోనే జరిగింది. ఈ సేవలు విస్తరించకుండా కొందరికి పరిమితమయ్యాయి. ముఖ్యంగా గూగుల్, ఫేస్ బుక్ లాంటి పెద్ద కంపెనీలు అనేక చోట్ల డేటా సెంటర్ల నెట్ వర్క్ ను ఏర్పాటుచేశాయి. నిన్న ఏం జరిగిందో తెలుసా? గూగుల్ సేవలు ఆగిపోయిన 45 నిమిషాల్లో దాదాపు 850 కోట్ల ఇమెయిళ్ల పంపకం ఆగిపోయిందట. ఒక అంచనా ప్రకారం ఇప్పుడు ప్రతిరోజూ 180 మంది సగటున 30.60 వేల కోట్ల ఇమెయిళ్లను పంపుతారట.
యూట్యూబ్ పరిస్థితి ఏమిటి?
ఇప్పుడు యూట్యూబ్ అనేది జనజీవితంలో భాగమై పోయింది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు వచ్చాక శాటిలైట్ ఛానళ్లకు బదులు యూట్యూబ్ లోనే తమకు కావలసిన వినోదాన్ని జనం పొందుతున్నారు. ఒక లెక్క ప్రకారం నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్ లోడ్ అవుతోందట. నిన్న సేవలు ఆగిన సమయంలో 20 వేల గంటల కంటెంట్ అప్ లోడ్ కాకుండా ఆగిపోయింది. ఆ సమయంలో యూట్యూబ్ లో 209 మంది వినియోగదారులు ఉన్నారు. మరి ఇంతమంది వినియోగదారులు ఉన్నప్పుడు నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించండి. మనిషి జీవితం కాలంతో ముడిపడి ఉంటుంది. మన జీవితంలో నుంచి ఈ 45 నిమిషాల కాలాన్ని మినహాయించుకోవలసిందే. మన ఈ గూగుల్ బంధం భవిష్యత్తులో ఇంకెలా ఉండబోతోందో?
– హేమసుందర్ పామర్తి