బాషా బాబా రజినీ కాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమవుతోంది. ఆయన రాజకీయ పార్టీ పేరు ‘మక్కల్ సేవై కట్చీ’ అని తెలుస్తోంది. తెలుగులో ప్రజా సేవా పార్టీ అనుకోవచ్చు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 234 నియోజక వర్గాల్లో పోటీ చేయడానికి ఈ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ పేరుకు ఎన్నికల సంఘం నుంచి ఆమోద ముద్ర లభించినట్లు సమాచారం. మొదట్లో దీనికి అనైతింధియ మక్కల్ శక్తిగా నమోదు చేసినా ఎన్నికల సంఘం నుంచి అభ్యంతరాలు రావడంతో చివరికి మక్కల్ సేవై కట్చిగా మార్చారు.
ఇక పార్టీ గుర్తు విషయంలోనూ సందేహాలు ఉన్నాయి. రజనీ మొదటి ప్రాధాన్యం 2002లో వచ్చిన ‘బాబా’ సినిమాలోని రెండు వేళ్ల ముద్రను పేర్కొన్నారు. రెండో ప్రాధాన్యంగా ఆటో రిక్షా గుర్తును సూచించారు. 1995లో ఆయన నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘బాషా’లో ఈ ఆటోతోనే రజినీకి ఎంతో పేరు వచ్చింది. అయితే బాబా సింబల్ ను ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. చివరికి ఆటోరిక్షా గుర్తే ఈ పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. మొదట్లో సైకిల్ గుర్తు అనే వార్తలు కూడా వచ్చాయి. కాకపోతే అలాంటి ప్రతిపాదన ఏదీ పార్టీ నుంచి ఎన్నికల కమిషన్ కు రాలేదు.
Must Read ;- రజినీ, కమల్.. మల్టీస్టారర్ రాజకీయమేనా?