ఐటీ దిగ్గజం గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయబోతున్న అతిపెద్ద డేటా సెంటర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్వెస్ట్ ఇండియా ట్విట్టర్‌లో పోస్టు చేసింది. గూగుల్ డేటా సెంటర్ గేమ్ ఛేంజర్ కానుందని, ఈ పెట్టుబడితో ఇండియా ప్రపంచానికి డిజిటల్ హబ్‌గా మారనుందని పేర్కొంది. ఈ ట్వీట్‌తో ఇప్పుడు ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోంది. గూగుల్ క్లౌడ్, సెర్చ్, యూట్యూబ్, AI వర్క్‌ల పర్యావరణ వ్యవస్థ బలోపేతం చేసేందుకు ఈ డేటా సెంటర్ ఉపయోగపడనుంది. పరిశ్రమలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఏఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
విశాఖలో గూగుల్ సంస్థ దాదాపు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద హైపర్‌స్కేల్ డేటా సెంటర్ కానుంది. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసే అతిపెద్ద కేంద్రానికి విశాఖ వేదిక కానుంది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటైతే మన దేశానికి చెందిన డేటా ఇక్కడే నిల్వ అవుతుంది. దీనివల్ల డేటా చోరీ భయం ఉండదు. అంతర్జాతీయ బ్యాండ్‌విడ్త్‌ను పెంచేందుకు 3 సబ్ మెరైన్ కేబుల్స్‌కు సరిపడా ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి డేటా సెంటర్‌ను అనుసంధానిస్తుంది. ముంబయిలో గూగుల్‌కు చెందిన పియరింగ్, క్యాచీ సర్వర్లు ఉన్నాయి..అక్కడి నుంచి సముద్ర మార్గంలో కేబుల్ తీసుకోవడంసులువు. డార్క్ ఫైబర్ ద్వారా తక్కువ ఖర్చుతో తీసుకోవడం సాధ్యం అవుతుంది. డేటా సెంటర్ కూలింగ్ కోసం పెద్దఎత్తున నీరు అవసరం. అందుకే డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ విశాఖ సముద్ర తీరాన్ని ఎంపిక చేసుకుంది.
ఐటీ రంగంలో రూ.2 కోట్ల పెట్టుబడి పెడితే ఒకరికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఆ లెక్కన గూగుల్ సంస్థ పెట్టే సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడుల ఆధారంగా సుమారు 25 వేలమందికి దశలవారీగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా. పరోక్షంగా మరో 50 వేలమందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. డేటా సెంటర్ కోసం రెన్యూవెబుల్ ఎనర్జీని వినియోగించాలని గూగుల్ నిర్ణయించింది. డేటా సెంటర్ కూలింగ్.. నిర్వహణకు ఎక్కువ విద్యుత్ అవసరం. ఆ విద్యుత్ ప్రాజెక్టుల కోసం సుమారు రూ.20 వేల కోట్లను ఖర్చు చేయనుంది. సముద్ర తీరం వెంట చిన్న హైడ్రో ప్రాజెక్టులు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా వచ్చే విద్యుత్‌ను గూగుల్ వినియోగించుకునే అవకాశం ఉంది. అమెరికాలో కొన్ని సంస్థలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి











