ఏపీలో నివర్ తుపాను రైతాంగానికి భారీ నష్టం మిగిల్చింది. నివర్ ప్రభావంతో ఏపీలో తొమ్మిది జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. ఖరీఫ్ వరి పంట చేతికొచ్చే సమయంలో నివర్ విరుచుకుపడటంతో 9 జిల్లాల్లో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అయితే ప్రభుత్వం మాత్రం 40 వేల హెక్టార్లలో మాత్రమే పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాలు తయారు చేయించింది. రైతులకు నెలరోజుల్లో పరిహారం ఇస్తామని చెబుతుందే కానీ, నష్టం అంచనాలను దారుణంగా తగ్గించి 90 శాతం రైతులను అన్యాయం చేసే కుట్ర సాగుతోందనే అనుమానం వస్తోంది.
నివర్ నష్టం అపారం
నివర్ తుఫానుతో 9 జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వరిపంట నీట మునిగింది. కొన్ని ప్రాంతాల్లో వరిపొలాలు నేలకొరిగాయి. నీటిలో వారం రోజులుగా వరికంకులు నానిపోయాయి. ధాన్యం మొలక వచ్చింది. దిగుబడులు సగానికి తగ్గడంతోపాటు, వచ్చిన అరకొర దిగుబడులు కూడా నాణ్యత లేకపోవడంతో మార్కెట్లో వాటిని అమ్ముకోవడం కూడా కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ వరి పంట పది రోజుల్లో ఇంటికి వస్తుందనుకున్న సమయంలో నివర్ విరుచుకుపడింది. చిత్తూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు అన్నీ జిల్లాల్లో వరిసాగులో ఉంది. ఈ జిల్లాల్లో ఖరీఫ్ లో 60 లక్షల ఎకరాల్లో వరిసాగువుతోంది. ఇందులో నివర్ తుఫానుతో 20 లక్షల ఎకరాల వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే ప్రభుత్వం పరిహారం నెల రోజుల్లోనే ఇస్తామని చెబుతోంది. కానీ నివర్ తో నష్టపోయిన ప్రతి రైతులను ఆదుకుంటామని మాత్రం భరోసా ఇవ్వడం లేదు. ఏదో అరకొరగా 40 వేల మంది రైతులకు పరిహారం చెల్లించి, గత ప్రభుత్వం తుఫానులకు నష్టపోయిన రైతులకు మూడేళ్లకు కూడా పరిహారం ఇవ్వలేదు.. మేం నెల రోజుల్లోనే జమ చేశామని ప్రకటనలు గుప్పించడానికి తప్ప నిజంగా నష్టపోయిన రైతులను ఆదుకునే కోణం కనిపించడం లేదు. లక్షలాది ఎకరాల్లో పంటనష్టం కళ్లకు కనిపిస్తూ ఉంటే కేవలం 40 వేల హెక్టార్లలోనే పంట నష్ట వాటిల్లిందని ప్రాథమిక అంచనాలు రూపొందించడం అనేక అనుమానాలకు తావిస్తోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పంట బీమా పచ్చిమోసం
పంటల బీమా రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏటా రూ.3000 కోట్ల పంటల బీమా చెల్లించాల్సి వస్తోంది. కానీ రైతుల తరపున పంటలబీమా చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ పని చేయలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైతుల తరపున పంటలబీమా చెల్లించి ఉంటే రైతులకు బీమా వచ్చేలా కృషి చేయాలి. కానీ అలాంటివి జరగడం లేదు. రైతులకు నెల రోజుల్లో పంట నష్ట పరిహారం గురించి మాత్రమే చెబుతున్నారు. కానీ పంటల బీమా ఊసెత్తడం లేదు. పంటల బీమా ప్రభుత్వమే చెల్లిస్తుందని రైతులను దగా చేశారని రైతు నాయకులు విమర్శిస్తున్నారు.
పంటల బీమా వసూలు చేసుకుంటున్న కంపెనీలు పరిహారం చెల్లింపు విషయంలో మాత్రం ముందుకు రావడం లేదని, ప్రభుత్వమే పంటల బీమాకు ఓ కంపెనీ ఏర్పాటు చేస్తుందని సీఎం జగ్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఒకటిన్నర సంవత్సరం అయినా ఆ పని చేయలేదు. నివర్ తుఫానుతో రైతులు తీవ్రంగా నష్టపోవడంతో వచ్చే నెలలో పంటల బీమా కంపెనీ ఏర్పాటు చేస్తామని మంత్రులు ప్రకటించడం శోచనీయం.
పరిహారం కంటితుడుపు చర్యలేనా..
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎకరాకు రూ.5వేలు మించి పంటనష్టం పరిహారం ఇవ్వడం లేదు. పంటల బీమా చెల్లించినా సదరు కంపెనీలు నిబంధనల పేరుతో బీమా చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. ఎకరా వరిసాగు చేసిన రైతు తుఫానులు వస్తే రూ.30 వేల పెట్టుబడులు నష్ట పోవాల్సి వస్తోంది. ఒక వేళ ప్రభుత్వం పరిహారం అందించినా రైతుకు జరిగిన నష్టంలో 10 శాతం మించడం లేదు. పంట నష్ట పరిహారం పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతులు నష్టపోయిన విలువలో కనీసం సగం పరిహారంగా ఇవ్వాలని వారు విజ్ఙప్తి చేస్తున్నారు.