కన్నడ సూపర్ స్టార్ యష్ ప్రస్తుతం ‘కెజిఎఫ్ – 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ‘కెజిఎఫ్ – 2’ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అయ్యింది. దాదాపు ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభం అయిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరపడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రాకింగ్ స్టార్ యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కోసం యష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
మొదట దసరాకు, ఆ తర్వాత దీపావళికి ట్రైలర్ రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ అది నిరాశగానే మిగిలిపోయింది. ఇప్పుడు ‘కెజిఎఫ్ – 2’ సినిమాపై ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ నెల చివరి వారంలో ‘కెజిఎఫ్ – 2’ సినిమా రిలీజ్ డేట్ ను నిర్మాతలు ప్రకటిస్తారట. అప్పటిలోగా సినిమా షూటింగ్ ను పూర్తి చేసే విధంగా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం ‘కెజిఎఫ్ – 1’. విడుదలైన ప్రతీ భాషలోని పెద్ద విజయం సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ ఒక్క సినిమాతో యష్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ‘కెజిఎఫ్ – 1’ లాగానే ‘కెజిఎఫ్ – 2’ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అంచనావేస్తున్నారు. మరి ‘కెజీఎఫ్ 2’ ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తుందో చూడాలి.