జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి. కానీ.. ఎన్నికల్లో నమోదైన పోలింగ్ సరళిపైనే ఇప్పుడంతా చర్చ జరుగుతోంది. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45.27 శాతం పోలింగ్ నమోదైతే ఈ సారి జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం 46.6గా నమోదైంది. గతంలో జరిగిన ఎన్నికలతో పోల్చితే..ఈ సారి పోలింగ్‌లో స్వల్ప పెరుగుదల కనిపించింది. కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇంత తక్కువ స్థాయి పోలింగ్ జరగడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది.
పోలింగ్ శాతం అంటుంచితే.. చైతన్యవంతులుండే మహానగరంలో ఇంత తక్కువ పోలింగ్ శాతం నమోదుకావడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటరును పోలింగ్ కేంద్రం వరకు తీసుకొచ్చేలా ఎన్నికల యంత్రాగం ఇంకా చొరవచూపాల్సి ఉంటుంది. దానికనుగుణంగానే ఓటరు కూడా తమ ఓటు వేయడంలో బాధ్యతగా వ్యవహరించాలని మేథావులు చెప్తున్నారు. పల్లెల్తో పోల్చితే.. గ్రేటర్‌లో తక్కువగా ఓటింగ్ జరగడంపై నిర్బంధ ఓటింగ్ జరగాలనే డిమాండ్ తాజాగా తెరపైకి వస్తోంది. దీనిపై గతంలోనూ చర్చ జరిగినా.. మన దేశంలో ఇంకా అది అమలుకు నోచుకోలేదు.
2017 ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా నిర్బంధ ఓటుపై ఓ చర్చ నడిచింది. అక్కడ ఓ సంస్థ ఇచ్చిన ప్రకటన అందుకు కారణమైంది. ఓటు వేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఎలక్షన్ కమిటీ ఆఫ్ ఇండియా.. అనే సంస్థ పేపర్లో ఏకంగా ప్రకటన ఇచ్చేసింది. ఆ సంస్థ విశ్వసనీయత విషయం పక్కనపెడితే.. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. అలాగే గుజరాత్‌లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటు వేయాలనే విధానాన్ని తప్పనిసరి చేస్తూ అక్కడి ప్రభుత్వం 2016లో ఉత్తర్వులు జారీచేసింది. అయితే న్యాయస్థానాలు ఆ ఉత్తర్వులను కొట్టివేశాయి. దాంతో ఆ చర్చకు కూడా పుల్‌స్టాప్ పడినట్లయ్యింది. ఇలాంటి ఉత్తర్వులు చాలానే జారీ అయినా.. అవి పౌరుల హక్కులకు భంగం కల్గించేలా ఉన్నాయని.. రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్దమన్న అభిప్రాయాన్ని అప్పట్లో న్యాయస్థానం వ్యక్తం చేసింది.
కోట్ల మందికి శిక్షలు సాధ్యమా..
నిర్బంధ ఓటు విధానం అంటే.. సహేతు కారణం లేకుండా ఓటింగ్‌కు దూరంగా ఉంటే ఆ చట్ట ప్రకారం ఓటు వేయని వారు శిక్షకు అర్హులవుతారు. ఇతర దేశాల్లో ఓటు వేయని వారిపై అమలవుతున్న శిక్షలను పరిశీలిస్తే.. జైలు శిక్ష, జరిమానా, సంక్షేమ పథకాల్లోనూ, నెలవారి జీతాల్లోనూ కోత పెట్టడం లాంటి నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి.
నిర్బంధ ఓటు విధానం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 22 దేశాల్లో అమల్లో ఉంది. ఆస్ట్రేలియా, ఈక్వెడార్, ఈజిప్ట్, గ్రీస్, పెరూ, సింగపూర్, థాయిలాండ్, ఉరుగ్వే, బెల్జియం బొలీవియా, బ్రెజిల్, మెక్సికో తదితర లాంటి దేశాల్లో తప్పనిసరి ఓటింగ్ విధానం అమలులో ఉంది. ఆస్ట్రేలియాలో ఓటు వేయని వ్యక్తికి 20 డాలర్ల జరిమానా విధిస్తారు. అదే గ్రీస్ ఈజిప్టు దేశాల్లోనైతే ఓటు వేయకపోతే కనిష్టంగా వారం.. గరిష్టంగా 90 రోజుల జైలు శిక్ష విధిస్తారు. ఇక ఇటలీ విషయానికొస్తే ఓటు వేయని వారి వివరాలు ఏకంగా పాంప్లెట్లలో ప్రకటిస్తారు. బెల్జియంలో ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హతగా ప్రకటిస్తారు. బొలీవియాలో అయితే జీతం నిలిపేస్తారు. ఇవే కాకుండా చాలా దేశాల్లో ప్రభుత్వ పథకాలను దూరంగా ఉంచుతారు. ఇక వంద కోట్లకుపైగా జనాభా ఉన్న మన దేశంలో ఆ స్థాయి శిక్షలు వేయడం సాధ్యమా?.. ఆ దిశగా రాజ్యాంగ సవరణలు చేయడానికి ప్రభుత్వాలు పూనుకుంటాయా? అంటే అది పెద్ద ప్రశ్నగానే మిగిలి ఉంటుంది.