(నల్గొండ నుంచి లియో ప్రత్యేక ప్రతినిధి)
ఒక నాడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న నల్లగొండ జిల్లా ఇపుడు పూర్తిగా తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్‌ఎస్) వశమైంది. చానాళ్ల పాటు మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ కూడా ఇపుడు కేవలం ఒక స్థానంలోనే ప్రాతినిధ్యం వహిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్, హుజూర్‌నగర్, మునుగోడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించినా.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎన్నికలు జరిగిన ఏడాదిలోపే గోడ దూకి గులాబీ గూటిలోకి చేరారు. ఇక, హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా ఉండిన పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ సభ్యునిగా విజయం సాధించడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. అంటే.. ఇపుడు కాంగ్రెస్ చేతిలో ఉంది కేవలం మునుగోడు నియోజవవర్గం మాత్రమే. పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న నల్లగొండ జిల్లాలో ఇపుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ చేతిలో ఉన్నారు. వీరితో పాటు అయిదుగురు శాసన మండలి సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్‌గా, నేతి విద్యాసాగర్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా, పల్లా రాజేశ్వర్ రెడ్డి మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, కర్నె ప్రభాకర్ మండలిలో ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. ఈ సంఖ్య, జిల్లా నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న పదవులను చూస్తే పార్టీ ఎంతో బలంగా ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ.. ఆ పార్టీలోని గుంపుల లొల్లి గురించి తెలుసుకుంటే పార్టీది బలం కాదు వాపు అన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది.
వర్గాలుగా విడిపోయిన నేతలు
అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్ ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బొక్కబోర్లా పడింది. జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో అపజయం మూటగట్టుకుంది. ఈ ఒక్క అపజయాన్ని మినహాయిస్తే.. గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో సహజంగానే స్థానిక ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వచ్చాన్న అభిప్రాయం కూడా లేక పోలేదు. ఇంత వరకు అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా.. పార్టీ నేతల మధ్య సఖ్యత మాత్రం కొరవడింది. పార్టీ ఆవిర్భావం నుంచీ ఉన్న వారు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆయా పార్టీల నుంచి వలస వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన వారు .. ఇలా రెండు వర్గాలుగా నిట్టనిలువునా చీలిపోయి ఉంది.
మంత్రి జగదీష్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రెండు శిబిరాలకు నాయకత్వం వహిస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ నుంచి ఒక సారి, కాంగ్రెస్ నుంచి రెండు మార్లు పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన గుత్తా సుఖేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నుంచి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్ రావు, సీపీఐ టికెట్‌పై గెలిచిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ టీఆర్‌ఎస్ బాట పట్టారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచారు. వీరిలో రవీంద్ర కుమార్ గుత్తా నుంచి పక్కకు జరిగిన మంత్రి కోటరీలో చేరి పోయారు. మరో వైపు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు, ఆ నియోజకవర్గంలో మంత్రి అనుచరులుగా ఉన్న వారికి పొసగడం లేదు.
దీంతో నోముల సైతం గుత్తాకే జై కొట్టారు. ఇక మిగిలిన నల్లగొండ, నకిరేకల్, తుంగతుర్తి, హుజూర్‌నగర్ ఎమ్మెల్యేలు మంత్రితో ఉన్నారు. భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు తటస్థంగా గ్రూపులతో సంబంధం లేకుండా కొనసాగుతున్నారు. అయితే,… జిల్లా రాజకీయాల్లో మంత్రి జగదీష్ రెడ్డిదే పై చేయిగా ఉంది. అయితే.. వివిధ సందర్భాల్లో ఈ ఇద్దరు నేతల మధ్య బయటకు కనిపించని యుద్దమే జరుగుతోందని గులాబీ శ్రేణులు గుసగుసలు పోతున్నాయి. జిల్లాలో టీఆర్‌ఎస్‌లో జరుగుతున్న పరిణామాలను పార్టీ హైకమాండ్ చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.
…కేపీ











