ఆంధ్రుల దశాబ్ధాల కల పోలవరంపై కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని హామీ ఇచ్చారు. 2027 ఆగస్టులో గోదావరి పుష్కరాలు జరగనుండగా..ఏ సాంకేతిక సమస్యలు తలెత్తకుంటే 2027 ఏప్రిల్ నాటికే పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఒకవేళ ఇబ్బందులు ఎదురైనా 2027 డిసెంబరు నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును గురువారం సందర్శించిన చంద్రబాబు..పనులను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్వాసితులతో మాట్లాడారు.
ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యాం పూర్తయిందని, 2026 జులై నాటికి ఎడమ, కుడి కాలువల అనుసంధాన పనులు పూర్తి చేసి రెండు కాలువలకు గ్రావిటీ ద్వారా నీళ్లివ్వాలనే ఆలోచన ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేలా విభజన చట్టంలో పేర్కొని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని గుర్తు చేశారు. 45.72 మీటర్ల ఎత్తుకు పోలవరం నీళ్లు నిలబెడతామని చెప్పారు. కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తోందన్నారు.
పునరావాస కాలనీల నిర్మాణానికి తాజా ధరలతో మళ్లీ టెండర్లు పిలుస్తామన్నారు చంద్రబాబు. మొత్తం 972 కోట్లు అంచనా వేశామని చెప్పారు. తొలి దశలో 1Aలో ఇప్పటిరే 14 వేల 309 కుటుంబాలను తరలించామని చెప్పారు. మరో 6 వేల 700 కుటుంబాలను తరలించాల్సి ఉందన్నారు. 49 కాలనీలు పూర్తి చేయాలని. పునరావాసం తొలిదశ 1Bలో భాగంగా 49 ఆవాసాల వారిని తరలించాలని చెప్పారు. తొలిదశలోనే ఇంకా రూ.6,270 కోట్లు ఖర్చవుతుందని స్పష్టం చేశారు.
జగన్ రాజకీయ కక్షతోనే పోలవరం ప్రాజెక్టులో విధ్వంసం జరిగిందన్నారు చంద్రబాబు. పోలవరంలో రివర్స్ టెండర్ల వల్ల రూ.5,282 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ప్రాజెక్టులో అదనంగా రూ.2,782 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. పోలవరం విద్యుత్తు కేంద్రంలో రూ.2,500 కోట్లు నష్టపోయామన్నారు. ఒక తప్పు వల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుందో చెప్పడానికి ఇదో పెద్ద ఉదాహరణ అని అభివర్ణించారు. అప్పట్లో డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయమూ ఎవరికీ తెలియదని, వాళ్లు గుర్తించలేదన్నారు. మన ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే 2020 జూన్‌కే ఈ ప్రాజెక్టు సులభంగా పూర్తయిపోయేదన్నారు.
విభజన తర్వాత అడుగడుగునా అవకాశాలు వినియోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేశానన్నారు చంద్రబాబు. రాష్ట్రం రూపురేఖలు మార్చాలనుకున్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు 7 ముంపు మండలాలు తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమని నాడు కేంద్రాన్ని ఒప్పించి ముందే ఆర్డినెన్సు తెప్పించానన్నారు. జూన్ 2న రాష్ట్ర విభజన నోటిఫికేషన్ రాక ముందే ఆర్డినెన్సు తీసుకురావడం ఓ రికార్డని చెప్పారు. 2019లో ప్రభుత్వం మారడంతోనే పరిస్థితులు తారుమారయ్యాయన్నారు. రాజకీయ దురుద్దేశంతో ప్రాజెక్టుపై కక్షగట్టి, విధ్వంసం చేశారని గుర్తు చేశారు కేంద్రంలో మళ్లీ మన ప్రభుత్వమే వచ్చిందన్న చంద్రబాబు.. అప్పటికి ఉన్న సాంకేతిక సమస్యలు చూసి భయం వేసిందన్నారు. ఇది చేయగలమా అనిపించిందన్నారు.
పోలవరం ప్రాజెక్టు వద్ద నాలుగు ఐల్యాండ్‌లు ఉన్నాయన్నారు. ఆ కొండలపై హోటళ్లు నిర్మించి…పాపికొండల నుంచి ధవళేశ్వరం వరకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలవరం వద్ద ఐకానిక్ వంతెన నిర్మిస్తాం. పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటాం. పుష్కరాల నాటికే వీటిని అభివృద్ధి చేసేలా ప్రయత్నిస్తామన్నారు చంద్రబాబు.
పోలవరం ప్రాజెక్టు నీళ్లతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. అలాగే ఈ ప్రాజెక్టు కోసం ఊళ్లు, భూములు వదులుకున్న నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. వారికి పునరావాసంతో పాటు జీవనోపాధి కల్పిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్ కూడా తీసుకువచ్చి ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. పునరావాస కాలనీల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు చేస్తామని..నిర్వాసితులకు మెరుగైన జీవనోపాధి కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.