తన కెరీర్ బిగినింగ్ లోనే బాలలతో రామాయణం మూవీని రూపొందించి మంచి పేరు తెచ్చుకున్నాడు గుణశేఖర్. ఆ తర్వాత కమర్షియల్ చిత్రాల మూసలో పడి.. పురాణాలపై తనకున్న పట్టును, టాలెంట్ ను తాత్కాలికంగా పక్కన పెట్టాడు. ‘రుద్రమదేవి’ చారిత్రక చిత్రంతో గుణశేఖర్ .. మళ్ళీ తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ మీద పనిచేయడం మొదలు పెట్టాడు. ఆ సినిమాను సొంత నిర్మాణంలో తెరకెక్కించి చేతులు కాల్చుకున్నప్పటికీ.. గుణ శేఖర్ .. పురాణాల్ని వదలిపెట్టలేదు.
నిజానికి రానాతో ‘హిరణ్యకశ్యప’ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడు. అయితే పాండమిక్ సిట్యువేషన్స్ వల్ల .. ఆ సినిమా రూపకల్పనను తాత్కాలికంగా వాయిదా వేసి .. ఇప్పుడు సమంతతో శాకుంతలం అనే పురాణ కథను టేకప్ చేశాడు. ఈ సినిమా కొద్ది రోజులు షూటింగ్ జరుపుకున్నంతలోనే .. మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ ఆ ప్రయత్నానికి బ్రేకులు వేసింది.
ప్రస్తుతం గుణశేఖర్ .. ‘ప్రతాపరుద్ర’ చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టినట్టు వార్తలొస్తున్నాయి. నిజానికి గుణ .. రుద్రమదేవి తర్వాత దానికి సీక్వెల్ గా ‘ప్రతాపరుద్ర’ను తీద్దామని అనుకున్నాడు. ఆ మేరకు రుద్రమదేవి సినిమా ఎండింగ్ లో ఆ సినిమా రాబోతున్నట్టు కూడా హింటిచ్చాడు. అయితే గుణశేఖర్ అనూహ్యంగా ‘హిరణ్యకశ్యప’ కథ మీద కసరత్తులు ప్రారంభించాడు. ఇప్పుడు ఆప్రాజెక్ట్ ను కూడా పక్కన పెట్టి శాకుంతలం మొదలు పెట్టాడు. బహుశా ఈ సినిమా తర్వాత గుణశేఖర్ రూపొందించేది ప్రతాపరుద్ర నే అవుతుందేమో చూడాలి. ఓ క్రేజీ స్టార్ హీరోతో ‘ప్రతాపరుద్ర’ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడట గుణశేఖర్.