ఏపీలో వచ్చే ఎన్నికల్లో తనకు నష్టం కలిగించే ఏ విషయం గురించైనా జగన్ బెదిరిపోతున్నారు. అధికార పార్టీ నేతలకు రాజకీయ ప్రయోజనాలు తప్పితే ఇంకొకరి గురించి పట్టడం లేదు. అవతలి వ్యక్తి ఎంతటి గొప్ప వ్యక్తి అయినా, నిపుణుడు అయినా, కళాకారుడు అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పౌరులకు కనీస స్వేచ్ఛ కరవు అవుతున్న ఘటనలు ఎన్నో ఇప్పటికే వెలుగు చూశాయి. సోషల్ మీడియా సహా నేరుగా భావప్రకటనా స్వేచ్ఛకు రాష్ట్రంలో ఎప్పుడో సంకెళ్లు పడ్డాయి. ఏ ప్రత్యేక సందర్భం జరిగినా దానికి ప్రతీకగా నిలిచేలా వ్యవహరించే కళాకారులకు సైతం చేతులు కట్టేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
ఓ సైకత కళాకారుడికి తాజాగా ప్రభుత్వం నుంచి అడ్డుపుల్ల ఎదురైంది. అంతర్జాతీయ స్థాయిలో సైకత శిల్పాల ప్రదర్శనలో మూడుసార్లు మొదటి బహుమతి అందుకున్న సైకతశిల్పి బాలాజీ వరప్రసాద్ బాపట్లలో ప్రభుత్వం నుంచి చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘జస్టిస్ ఫర్ సీబీఎన్’ అంటూ సెప్టెంబరు 21న బాపట్ల మండలం పాండురంగాపురం కొత్త ఓడరేవు బీచ్ లో వరప్రసాద్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయగా, అందుకు సహకరించిన వారైన స్థానిక టీడీపీ నేతలు వేగేశ్న నరేంద్రవర్మ, శిల్పి బాలాజీ వరప్రసాద్‌తోపాటు టీడీపీ నేతలపై బాపట్ల తాలూకా పోలీసులు కేసు పెట్టారు. అయితే ఈ విషయం ఆ సైకత శిల్పి వరప్రసాద్ కు తెలియదు. తాజాగా తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ రేవంత్ సైకత శిల్పాన్ని బాపట్లమండలం సూర్యలంక బీచ్ లో తీర్చిదిద్దుతుండగా.. గ్రామపంచాయతీ సెక్రటరీ ప్రసాద్ అడ్డుకున్నారు.
పర్మిషన్ లేకుండా ఇసుక శిల్పం వేయకూడదని పంచాయతీ సెక్రటరీ హుకుం జారీ చేశాడు. దీంతో సైకత శిల్పి వరప్రసాద్ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ అయిన తహసీల్దార్‌ను కలవడానికి వస్తే ఆమె అందుబాటులో లేరు. దీంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి ప్రయత్నించారు. అక్కడా శిల్పి ఊహించని పరిణామం ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో జస్టిస్ ఫర్ సీబీఎన్ అని సైకత శిల్పం చేసినందుకు కేసు నమోదైందని పోలీసులు చెప్పారు. ఆ నోటీసుపై సంతకం పెట్టాలని లేదంటే.. ఎస్‌ఐ వచ్చేదాకా ఇక్కడే కూర్చోవాలంటూ కానిస్టేబుళ్లు తేల్చి చెప్పారు. దీంతో ఆయన కంగారుపడిపోయి తనపై కేసు ఉన్నట్లు చెప్పలేదని, కనీసం నోటీసు కూడా జారీ చేయలేదని అన్నారు.
సైకత శిల్పి వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. తాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పాన్ని డిజైన్ చేయడం కోసం పోలీస్ స్టేషన్ కు వస్తే అరెస్టు చేస్తామంటారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్ నుంచి బయటకొచ్చి పోలీసులు, ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు గెల్చుకున్న ఒక కళాకారుడ్ని ఓ కానిస్టేబుల్ మర్యాద లేకుండా మాట్లాడడం, కళను అవమానిస్తూ అధికారులు వ్యవహరించడం సరికాదని స్థానికులు చెబుతున్నారు.











