ఎవరెన్ని చెప్పినా.. టీఆర్ఎస్ పార్టీలో కనిపించని అధిపత్య పోరు నడుస్తుందన్న విషయం రాజకీయం గురించి తెలిసిన చిన్న పిల్లాడికి కూడా తెలిసిందే. ఆ మధ్య వరకు హరీశ్..కేటీఆర్ వర్గాలు ఉంటే.. తర్వాతి కాలంలో కవిత.. సంతోష్ వర్గాలుగా మారాయి. మొత్తానికి నాలుగు స్తంభాలట నడుస్తున్న మాట గులాబీ నేతల అంతర్గత సంభాషణల్లో వినిపిస్తుంటాయి. ఎన్ని గ్రూపులు ఉన్నా.. అధినేత తర్వాత నెంబరు టూ స్థానం కేటీఆర్ కు కట్టబెట్టేయటం.. అందుకు హరీశ్ సైతం మౌనంగా ఉండటంతో ఇప్పటికైతే ఎవరికి పేచీ లేదు.
కానీ.. అప్పుడప్పుడు గులాబీ బాస్ కుటుంబానికి చెందిన మీడియాలోనూ..పార్టీ నేతలు ఇచ్చే ప్రకటనల్లో హరీశ్ బొమ్మ మిస్ కావటం చర్చనీయాంశంగా మారుతుంది. 2018లో జరిగిన ఎన్నికలకు కాస్త ముందుగా కొన్ని నెలల పాటు కేసీఆర్ మీడియా సంస్థకు చెందిన పత్రికలో హరీశ్ రావు బొమ్మ రావటం లేదన్న మాట రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా ఉండేది. తర్వాత కాలంలో అదే హరీశ్ రావు బొమ్మ.. కేసీఆర్ పత్రికలో మొదటిపేజీలో ప్రాధాన్యతతో వచ్చినప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఎలాంటి లొల్లి లేదన్న మాట గులాబీ కాంపౌండ్ నుంచి వినిపిస్తోంది.
వరుస పెట్టి ఎన్నికల వేళ.. అందరు కలిసికట్టుగా గెలుపు కోసం పని చేయటం తప్పించి మరింకేమీ లేవన్న మాటను చెబుతున్నారు. అయితే.. మాటలకు చేతలకు మధ్య తేడా ఇప్పుడు కొట్టొచ్చినట్లుగా కనిపించటం ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి నిజమాబాద్ స్థానిక సంస్థలకుజరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని కేసీఆర్ సొంత మీడియా సంస్థలోనూ.. వారికి ఏ మాత్రం పొసగదని చెప్పే మరో మీడియా సంస్థలో పెద్ద ఎత్తున యాడ్స్ వచ్చాయి. ఇందులో మంత్రి హరీశ్ రావు ఫోటో కొన్ని పేజీల్లో మిస్ కావటం గమనార్హం. పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న ఆయన ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటిది ఆయన ఫోటో మిస్ కావటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
మరికొన్ని యాడ్స్ లో కేసీఆర్ బొమ్మ పెద్దదిగా ఆ తర్వాత స్థానం మంత్రి కేటీఆర్ ది ఉండటం కనిపించింది. ఒకట్రెండు చోట్ల తప్పించి మిగిలిన అన్నిచోట్ల కేటీఆర్ బొమ్మ కంటే చిన్నదిగా.. ఎంపీ సంతోష్ బొమ్మ సైజుకు దగ్గరగా హరీశ్ ఫోటోలు ఉండటం కనిపించింది. సాధారణంగా ఇలాంటి సంబరాల వేళ.. కొత్త పంచాయితీలు తలెత్తకుండా..ఉన్న ఇష్యూస్ ను సెట్ చేసుకునేలా చేస్తారు. అందుకు భిన్నంగా కీలకమైన ఎన్నికల వేళలోనూ.. హరీశ్ బొమ్మను ఎత్తేయటం చూస్తే.. కదిలించి కంప మీదేసుకున్న భావన కలుగుతుంది. ఇక్కడే ఇంకో పాయింట్ కూడా ఉందంటారు. ఎప్పటికప్పుడు ఇది పరిస్థితి అన్న విషయాన్నిక్లియర్ గా చెప్పేస్తున్నారని కూడా చెప్పొచ్చు కదా? అన్న వాదనను కొందరు వినిపిస్తారు. పని పాటా లేకుండా.. ఇలా ఊరికే ఏవో ఒకటి చెప్పి పబ్బం గడుపుకోవటం అలవాటైందని విరుచుకుపడే వారు లేకపోలేదు. నిజమే.. వారు చెప్పినట్లు.. యాడ్ ఇచ్చిన పెద్ద మనిషికి హరీశ్ గుర్తుకు రాకపోయి ఉండొచ్చు. అంత మాత్రానికే స్వాతిముత్యాల్లాంటి వారికి ఏవేవో లింకు పెట్టేస్తారేంటి?