మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన అన్ని రికార్డులు ఇవ్వాలని సీబీఐ పులివెందుల మెజిస్ట్రేట్ ను కోరారు. వారు నిరాకరించడంతో సీబీఐ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్నందున ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు తమకు అప్పగించేలా ఆదేశించాలని సీబీఐ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. వెంటనే స్పందించిన ఏపీ హైకోర్టు వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు సీబీఐ అధికారులకు అప్పగించాలని ధర్మాసనం పులివెందుల మెజిస్ట్రేట్ ను ఆదేశించింది.
వేగంపుంజుకున్న వివేకానందరెడ్డి హత్య కేసు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వేగం పుంజుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన తరవాత అనేక మంది అనుమానితులను అధికారులు విచారించారు. అయితే ఈ కేసును విచారిస్తున్న కొందరు అధికారులకు కరోనా సోకడంతో కొంత జాప్యం జరిగింది. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కీలక ఆధారాలను సేకరించింది. ఈ హత్య కేసులో రికార్డులు మొత్తం సీబీఐ చేతికి వస్తే కీలక నిందితులను గుర్తించే అవకాశం దొరుకుతుందని భావిస్తున్నారు.