కరోనా బారిన పడి గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో రాజశేఖర్ కోలుకున్నారు. సోమవారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అందరూ కోలుకున్నా మధ్యలో రాజశేఖర్ పరిస్థితి కొంత ఆందోళన కరంగా మారింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వదంతులు కూడా వ్యాపించాయి.
దీనిపై జీవితా రాజశేఖర్ ఓ వీడియో విడుదల చేసి ఓ స్పష్టతను ఇచ్చారు. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. మొదట్నుంచీ ఆయన వెంటిలేటర్ పై ఉన్నట్టు వార్తలొచ్చాయి. రాజశేఖర్ పూర్గిగా కోలుకున్నారని, ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడిందని ఆమె వివరించారు. ఆయన కోలుకోడానికి వైద్యులు ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు.
అందువల్లే ఆయన క్షేమంగా బయటపడగలిగారని తెలిపారు. ఆస్పత్రిలో ఆయన ఎప్పుడూ వెంటిలేటర్ మీద లేరని, నాన్ ఇన్‌వాసివ్ వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ మాత్రం అందించారని ఆమె వివరించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జి చేస్తారని తెలియవచ్చింది.











