ఒకరి మాటలు విని ఆ ప్రకారం పోలీసులు పనిచేస్తున్నారు.. ఊరుకునేది లేదు.. వారికి ఇబ్బందులు తప్పవు అని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి రాములు హెచ్చరించడం వివాదస్పదం అవుతోంది. పోలీసులు కూడా ఆయన మాటల్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. అంతే ఘాటుగా ఆయనను కూడా హెచ్చరించారు. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా.. మాట్లాడితే ఊరుకునేది లేదని పేర్కొన్నారు.
ఆమంచి కుటుంబానికి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా పోలీస్ సంఘం అధికారులు మొదటిసారిగా మాట్లాడారు. పోలీసులు కరణం బలరాం ఆదేశాలు పాటిస్తున్నారని, ఇలా అయితే భవిష్యత్తులో పోలీసు వ్యవస్థకు ఇబ్బందులు వస్తాయని శుక్రవారం నాడు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి రాములు హెచ్చరించారు.
వైసీపీ ప్రభుత్వ నూతన ఇసుక పాలసీతో .. ఇన్నాళ్లూ ఆమంచి కుటుంబం చేతిలో ఉన్న ఇసుక మాఫియాకు ఇకపై ఇబ్బందులు ఎదురవనున్నాయనే వార్తలు నియోజకవర్గంలో వ్యాపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో జగన్ పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని.. చీరాలలో కరణం- ఆమంచి వర్గాలు బలప్రదర్శనకు ప్రయత్నించాయి. మళ్లీ ఇరువర్గాల ర్యాలీతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఒక ర్యాలీకి కరణం వెంకటేష్ నాయకత్వం వహించకగా, మరో ర్యాలీకి ఆమంచి స్వాములు నాయకత్వం వహించారు. ఆ ర్యాలీలోనే స్వాములు పోలీసులను హెచ్చరించడం జరిగింది. ఆయన మాటలకు నిరసనగా శనివారం జిల్లా పోలీస్ అధికారులు సంఘం పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఇన్నాళ్ల ఆమంచి కుటుంబ రాజకీయ చరిత్రలో.. ఎంతమందిపై దాడులు చేసినా? స్పందించని పోలీస్ సంఘం.. ఈ రోజు స్పదించడం పై జిల్లా రాజకీయ వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి.
ఇదిలా ఉండగా.. చీరాలలో ఇకపై ఘర్షణలకు దిగితే… ఆమంచి, కరణం లలో ఎవరినో ఒకరిని వదులుకోవడానికి కూడా సిద్ధమని ఇండైరెక్టు గా ఇరువర్గాలు చెప్పిన పార్టీ పెద్దలు స్పష్టం చేసినట్టు సమాచారం. సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రకాశం జిల్లా వైసీపీ నియజకవర్గాల ఇంచార్జి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈమేరకు ఆ నేతలతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
పోలీసులకు వార్నింగ్‌లు కొత్త కాదు
ఆమంచి వర్గీయులు పోలీసులకు వార్నింగ్‌లు ఇవ్వడం ఇవాళ కొత్త కాదు. గతంలో ఎర్రుపాలెం పోలీసు స్టేషన్లో హోం గార్డుగా పనిచేస్తున్న సూరిబోయిన రవికుమార్ రెడ్డికి ఆమంచి స్వాములు కొడుకునుంచి బెదిరింపులు వచ్చాయి. స్వాములు కొడుకు ఆమంచి రాజేంద్ర అని ఫోనులో చెప్పిన వ్యక్తి పోలీసులను బూతులు తిడుతూ.. కాళ్లు చేతులు తీయించేస్తానని బెదిరించినట్లుగా హోంగార్డు రవికుమార్ రెడ్డి అదే పోలీసు స్టేషన్లో కేసు పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు తొలిసారిగా పోలీసు అధికారుల సంఘం తరఫున తిరిగి ఆమంచి వర్గానికి హెచ్చరిక వెళ్లడం చర్చనీయాంశంగా ఉంది.
పోలీసు అధికారుల సంఘం విడుదల చేసిన లేఖ :