మహిళల రక్షణకోసం ప్రధానంగా ప్రభుత్వం హై అలర్ట్ యాప్ ను రూపొందించింది. అనంతపురం జిల్లాలో ఒక మహిళ కుటుంబాన్ని ఈ యాప్ ఆదుకుంది. తాడిపత్రి పట్టణంలో ఈరోజు రాత్రి 8 గంటల సమయంలో ఓ యువతిని ఆటో డ్రైవర్ బలవంతంగా తీసికెళ్తున్నట్లు అర్బన్ పోలీసు స్టేషన్లో అమ్మాయి తల్లి సమాచారం అందించింది. తన కూతురును కాపాడాల్సిందిగా పోలీసులకు విన్నవించింది. అభినందనీనయమైన విషయం ఏంటంటే.. ఫిర్యాదు చేసిన గంటన్నర లోపుగానే అనంత పోలీసులు దీన్ని ఛేదించారు. ఆటోను ట్రేస్ చేసి, అమ్మాయిని కాపాడారు.
‘హైఅలెర్ట్’యాప్ లో ఆ యువతి ఫోటో, వివరాలు అప్ లోడ్ చేశారు. పోలీసు అధికారులను జిల్లా వ్యాప్తంగా అప్రమత్తం చేశారు. తాడిపత్రి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసుల ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా గాలిస్తూ రంగంలోకి దిగారు. పోలీసుల చాకచక్యంగా వ్యవహరించడానికి హై అలెర్ట్ యాప్ తోడైంది. యువతిని, ఆమెను తీసుకువెళుతున్న ఆటోను యల్లనూరు రోడ్డు శివారు ప్రాంతంలో ట్రేస్ చేశారు.
సురక్షితంగా ఉన్న ఆ యువతిని మహిళా పోలీసుల సంరక్షణలో ఉంచి బలవంతంగా ఆటోలో తీసికెళ్లిన విషయమై ఆరా తీస్తున్నారు. ఆటో డ్రైవరు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నట్టు సమాచారం.










