ఎవరీ బాబాయి? ఎందుకు బెంగళూరు వెళ్లారు? ఎవరు రప్పించాలి? ఎందుకు రప్పించాలి? బాబాయిని బెంగళూరు నుంచి రప్పించాల్సిన అబ్బాయి ఎవరు?… ఇలా ప్రశ్నలన్నీ ఒకే సారి తన్నుకువస్తున్నాయి కదా. నిజమే… ఆ ప్రశ్నలన్నింటికీ జవాబు ఇచ్చేందుకే ఈ వార్త. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైవీ సుబ్బారెడ్డి… అబ్బాయిపై అలిగి చెప్పాపెట్టకుండా బెంగళూరు చెక్కేశారట. ఈ విషయం తెలిసిందో, లేదో గానీ… ఇప్పుడు బాబాయి సుబ్బారెడ్డిని బెంగళూరు నుంచి రప్పించేందుకు అబ్బాయి జగన్ స్వయంగానే రంగంలోకి దిగక తప్పదా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా బాబాయి, అబ్బాయిల మధ్య వ్యవహారం బాగానే నడిచినా… మొన్నటి సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి శ్రుతి తప్పిపోయింది. ప్రతి చిన్న విషయానికీ అబ్బాయిపై బాబాయి అలిగేస్తున్నారు. పిన్నమ్మ భర్త కదా… కష్టమైనా అబ్బాయి బుజ్జగించి మరీ బాబాయి అలక తీరుస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే తలెత్తింది. జగన్ తీసుకున్న ఓ నిర్ణయంతో అలిగిన సుబ్బారెడ్డి… చెప్పా పెట్టకుండా బెంగళూరు ఫ్లైటెక్కేశారు. దీంతో తిరిగి ఆయనను అమరావతి రప్పించేందుకు జగన్ చర్యలు చేపట్టక తప్పని పరిస్థితి నెలకొంది.
స్వయంగా కోరినా జగన్ స్పందించలేదా?
అయినా ఈ సారి సుబ్బారెడ్డి అలకకు దారి తీసిన కారణాలేమిటన్న విషయానికి వస్తే… 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటిదాకా ఒంగోలు ఎంపీగా కొనసాగిన సుబ్బారెడ్డి… టీడీపీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోసం టికెట్ ను వదులుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే కదా. అప్పుడు కూడా ఇప్పటిమాదిరే అలిగిన సుబ్బారెడ్డి బెంగళూరు వెళితే… జగనే స్వయంగా ఫోన్ చేసి ఆయన అలకను తీర్చి తిరిగి వచ్చేలా చేశారట. తాజాగా మొన్నటిదాకా టీటీడీ చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి పదవి ఉన్నట్టుండి ఊడిపోయింది. రెండేళ్ల వ్యవధి ఉండే సదరు చైర్మన్ పదవిలో తనను మరికొంత కాలం పాటు కొనసాగించాలని సుబ్బారెడ్డి రెండు సార్లు జగన్ కు విన్నవించారట. బాబాయి కోరిక మేరకే జగన్ కూడా చర్యలు చేపట్టినా… తన సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపించడంతో బాబాయికి మాట మాత్రంగా కూడా చెప్పకుండానే జగన్ టీటీడీ బోర్డును రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారట.
ఇప్పుడేం మందు రాస్తారో?
అంతే… జగన్ సర్కారు నుంచి టీటీడీ పాలక మండలి రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన వెంటనే… బాగా హర్ట్ అయిన సుబ్బారెడ్డి అలిగారట. జగన్ కు ముఖం కూడా చూపించకుండానే బెంగళూరు ఫ్లైటెక్కేశారట. ఎప్పుడు అలకబూనినా… బెంగళూరుకే వెళుతున్న సుబ్బారెడ్డి… ఈ దఫా కూడా అదే మంత్రాన్ని పాటించారు. మరి ఈ దఫా కూడా జగనే స్వయంగా రంగంలోకి దిగి బాబాయి అలకను ఎలా తీరుస్తారన్న కోణంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. 2019 ఎన్నికల నాటి అలకను తీర్చేందుకు టీటీడీ పదవిని ఎరగా వేసిన జగన్… మరి ఈ దఫా బాబాయి అలకకు ఏం మందు రాస్తారోనన్న అంశం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. మొత్తంగా బాబాయి అలక… అబ్బాయి బుజ్జగింపుపై సెటైర్ల మీద సెటైర్లు పడిపోతున్నాయి.











