ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. కాలుష్యం ఎక్కువగా విడుదల అవుతోందంటూ కొద్ది రోజుల కిందట కడప జిల్లాలోని జువారి సిమెంట్ కంపెనీని మూసివేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వెంటనే ఆదేశాలు అమలు పరిచారు. కడప జువారీ సిమెంట్ కంపెనీ మూసివేత ఆదేశాలను ఏపీ హైకోర్టు ఇవాళ కొట్టి వేసింది. ఏప్రిల్ 24న జువారీ సిమెంట్స్ మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశాలను సవాలు చేస్తూ జువారీ సిమెంట్స్ హైకోర్టులో వేసిన పిటీషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. కాలుష్య నియంత్రణ బోర్డు అభ్యంతరాలను ఈ నెల 31లోపు సరిచేసుకోవాలని, అప్పటి వరకు జువారీ సిమెంటు కంపెనీ నడుపుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
3 వేల మంది రోడ్డున పడ్డారు
జువారీ సిమెంటు కంపెనీ మూసివేతతో 3 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. 1998లో కడప జిల్లాలో ఈ పరిశ్రమ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి చాలా నాణ్యమైన సిమెంటు ఉత్పత్తి చేస్తూ జువారీ సిమెంటు కంపెనీ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక జువారీ సిమెంటు కంపెనీపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆ సంస్థ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం భార్య భారతి ఆధ్వర్యంలో నడుస్తోన్న సిమెంటు కంపెనీ వ్యాపారం పెంచుకునేందుకే జువారీ సిమెంటు కంపెనీపై కక్ష కట్టారని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.











