రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మరణించిన ఘటన ఎవరి నిర్లక్ష్యం వలన జరిగిందో తేల్చాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తిరుపతి రుయా ఘటనపై ఏపీ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది బాలాజీ ప్రభుత్వం, ఆస్పత్రి అధికారులు నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. దీనిపై ఇప్పటి వరకూ ఎఫ్‌ఐఆర్ కూడ నమోదు చేయలేదని తెలిపారు. ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారో కూడ స్పష్టత లేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటనలో కూడ అసమానతలు పాటించారన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతులకు రూ.కోటి పరిహారం ఇచ్చారని, రుయా ఘటనలో మృతులకు రూ.10 లక్షలు ప్రకటించారన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.రుయా ఆస్పత్రి ఘటన ఎవరి నిర్లక్ష్యమో తేల్చాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, పోలీసులు,ఆస్పత్రి అధికారులకు సూచించింది. విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
Must Read ;- ‘రుయా’ ఘటనలో మృతుల సంఖ్య 11 కాదు 23.. అందుకే ప్రతిపక్షాలను రానీయలేదా?