ఏపీలో జగన్ సర్కార్ అవినీతి, ప్రజలను మోసం చేస్తున్న విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమరశంఖం పూరించి రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు ఇచ్చారు. జగన్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు రేపు కరోనా బాధితులను ఆదుకోవాలనే డిమాండ్‌తో ‘సాధన దీక్ష’ చేపట్టనున్నారు. దీని కోసం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజయవాడకు చేరుకున్నారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిరసన దీక్ష చేపట్టనున్నారని, ఆయనతో పాటు 15 మంది పార్టీ సీనియర్ నేతలు దీక్షలో పాల్గొంటారని అచ్చెన్నాయుడు వివరించారు.
జిల్లా కేంద్రాలలోనూ..
సాధన దీక్ష పేరుతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తమ తమ జిల్లా కేంద్రాల్లో ఆందోళన నిర్వహించనున్నారు. కరోనా బాధితులను ఆదుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ తీవ్రతరం చేస్తామని, చంద్రబాబు దీక్షతో నైనా ప్రభుత్వంలో చలనం రావాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు తక్షణ సహాయం అందించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
అమరావతి విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు మంచి ఉద్యోగాలు
అమరావతిలోని విద్యాసంస్థల్లో చదివిన తొలి బ్యాచ్ విద్యార్థులకు మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిని దక్షిణ భారత దేశ విద్యా కేంద్రంగా మార్చాలన్నది తమ విజన్ అని అన్నారు. తమ విజన్ ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయని, అమరావతి ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులు ఈ ఏడాది రూ.50 లక్షల వార్షిక వేతనం వచ్చే ఉద్యోగాలు సాధించారని, ప్రముఖ యూనివర్సిటీలలో ప్రవేశాలు పొందారని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ విద్యార్థులు అత్యుత్తమ రీతిలో ఎదగాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.












