సినిమా షూటింగులకు పెద్ద సమస్యే వచ్చి పడింది. కరోనా సెకండ్ వేవ్ ముగిసి సినిమా పరిశ్రమ గాడిన పడబోతోందని అందరూ అనుకున్నారు. అంతకన్నా పెద్ద సమస్య ఉందని దర్శకనిర్మాతలకు అర్థమవుతోంది. అదేంటి అంటే నటీనటుల డేట్స్ సమస్య. దాదాపు రెండు నెలలుగా సినిమా షూటింగులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. చాలా సినిమాలకు బ్యాలెన్స్ షూటింగ్ మిగిలి ఉంది. ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. జులై మొదటి వారం నుంచి అందరూ మళ్లీ సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్దమవుతున్నారు.
అందుకు ప్రధాన సమస్య ఆర్టిస్టుల డేట్స్ క్లాష్ అవడం. చాలా సినిమాల్లో ఆ నటులే ఎక్కువగా ఉండటంతో దర్శకనిర్మాతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. డేట్స్ అడ్జెస్ట్ కావడం ప్రధాన సమస్యగా మారింది. చిన్న సినిమాలు మొదలుకుని మెగాస్టార్ ‘ఆచార్య’ వరకూ ఇది పెద్ద సమస్యగా మారింది. షెడ్యూల్ వేసుకుందామంటే ఫలానా సినిమాకు కేటాయించామంటూ నటులు చెబుతున్నారు. అందరికి ఒకేసారి డేట్స్ ఎలా సర్ధుబాటు చేయాలో ఆ నటులకు అర్థం కావడం లేదు. బిజీ ఆర్టిస్టులందరి పరిస్థితీ ఇలాంటిదే.
ఎంత త్వరగా షూటింగులు పూర్తిచేసుకుని బయటపడదామా అన్న ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారు. పైగా కొత్త సినిమాల కమిట్ మెంట్స్ కూడా ఉన్నాయి. మరో పక్క కరోనా మూడో వేవ్ భయపెడుతోంది. రాజమౌళి లాంటి వారు కూడా త్వరగా షూటింగు పూర్తిచేసే యోచనలో ఉన్నారు. ట్రిపుల్ ఆర్ షూటింగ్ చాలా వరకూ పూర్తికావచ్చింది. ఆయన ఇదివరకటిలా సినిమాని చెక్కుతూ కూర్చుంటే నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదనపు వ్యయాన్ని నిర్మాతలు భరించే స్థితిలో లేరు.
ఎంత త్వరగా సినిమాని పూర్తి చేసి సినిమాని జనంలోకి తీసుకువెళదామా అన్న ఆలోచనలోనే ఉన్నారు. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్ ప్రారంభమైంది. మరొకొన్ని జులై మొదటి వారంలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్నాయి. ఎక్కువ భాగం షూటంగ్ కంప్లీట్ అయిన సినిమాలనే ముందుగా పూర్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. దీనికి నిర్మాతల మండలి కూడా సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి డేట్స్ క్లాష్ ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు.
ఎవరి తొందర వారిది కాబట్టి నిర్మాతల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా ఉండాలంటే నిర్మాతల మండలి ఓ నిబంధనావళిని రూపొందించుకుంటే బాగుంటుంది. కొందరు నటుల డేట్స్ దొరికినా ఇంకొందరి డేట్స్ దొరక్క షూటింగ్ వాయిదా పడుతున్న సందర్భాలు ఉన్నాయి. జులైలో వీటిని క్రమబద్దీకరించాల్సిన అవసరం కనిపిస్తోంది. కొత్త సినిమాలను అప్పుడే సెట్స్ మీదకు తీసుకు వెళ్లకుండా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
Must Read ;- ప్రభాస్ సినిమాల షూటింగ్ ఆర్డర్ ఇదే