(ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి లియోన్యూస్ ప్రతినిధులు)
సామాన్యులు వైద్యుడిని దేమునిగా భావిస్తారు. ఏదైనా అనారోగ్యానికి గురైతే తమ కుటుంబానికి తమ ప్రాణం ఎంతో విలువైనది కాబట్టి…, ఆస్పత్రికి వెళ్లి తమను కాపాడమని ధనికుడైనా, పేదలైనా ఆశ్రయించేది ఆ వైద్యుడినే. కానీ, ఇప్పుడు కరోనా మహమ్మారి విస్తృతంగా విస్తరిస్తున్న సమయంలో.., సామాన్యులు ప్రాణాలు కాపాడటానికి కొందరు వైద్యులు నిబద్ధతతో పనిచేస్తుంటే.., మరికొందరు మాత్రం పేదల్ని జలగల్లా పీల్చి పిప్పిచేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో దళారులదే రాజ్యం…!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఈ దుస్థితి కనిపిస్తోంది. గ్రామం నుంచి పట్టణాల వరకూ ఆర్.ఎం.పి.లు.., ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మెడికల్ మాఫియా దెబ్బకి కుటుంబాలకు కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి.
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ముక్తినూతల పాడు గ్రామానికి చెందిన సుధీర్ తండ్రి ఓ రైతు. ఆయనకు కరోనా సోకింది. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం సరిగా అందదని.., ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రిలో చికిత్స కోసం తన తండ్రిని సుధీర్ తీసుకువెళ్లారు. ప్రాథమిక పరీక్షలు పూర్తి అవ్వడమే ఆలస్యం.., పరిస్థితి విషమంగా ఉంది. ముందు ఓ రూ. 2,00,000 డిపాజిట్ చేయండి.., అదనంగా మరో 5 లక్షలు రెడీ చేసుకోండి అని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. తండ్రి కంటే డబ్బు ముఖ్యం కాదని.., అందుకు సిద్ధపడి ఆస్పత్రిలో జాయిన్ చేశారు.
7 రోజుల తర్వాత మొత్తం 6 లక్షలు బిల్ చేసి.., తండ్రి పార్థివ దేహాన్ని చేతికి అప్పగించారు. మెరుగైన చికిత్స అందించి పేషంట్ ప్రాణాలు కాపాడలేదా? అని ప్రశ్నించిన బంధువులకు.., వైద్యులు చెప్పిన సమాధానం..? ఆలస్యంగా తీసుకువచ్చారు. చివరి ప్రయత్నం చేసాము, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే మరణించారు. మా తప్పు ఏమిలేదు అని చేతులు దులుపుకున్నారు. బాధను దిగమింగుకుని ఇంటికి పార్థివ దేహాన్ని తరలిద్దామనుకుంటే.., అక్కడా శవాల మీద చిల్లర ఏరుకునే వ్యాపారం. ఆస్పత్రి నుంచి 7 కి.మీ దూరంలో వారి ఇంటికి పార్థివ దేహాన్ని చేర్చడానికి రూ. 25,000 అవుతుంది అని అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు.
ఇక చేసేదేమీ లేక వారడిగిన మొత్తం సమర్పించి.., అంత్యక్రియలకు పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. సుధీర్ కుటుంబం ఆర్థికంగా కొంత ఉన్నత స్థితిలో ఉన్నా వారే.., ఆస్పత్రి యాజమాన్యం వేసిన బిల్లులు చెల్లించడానికి ఇబ్బందులు పడ్డారు. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటనేది ఇక్కడ ప్రశ్న. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తోంది. ప్రైవేటు ఆస్పత్రికి ఎవరు వెళ్లి..? డబ్బులు నష్టపోయి..? ప్రాణాలు కోల్పోమన్నారు అని అనొచ్చు..?
కానీ, ఒంగోలు జిల్లా కేంద్రం నడిబొడ్డున కలెక్టరేట్ కి కూత వేటు దూరంలో ఉన్న రిమ్స్ కోవిడ్ ఆస్పత్రి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వారం క్రితమే ముగ్గురు కరోనా పాజిటివ్ రోగులు ‘‘మాకు ఇక్కడ భోజనం కూడా పెట్టడం లేదు. ఇంటికి వెళ్లి మా ప్రాణాలు ఏవో అక్కడే కోల్పోతాం..’’ అని పారిపోయారు. దీన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దీనికి తోడు రిమ్స్ లో అంతా దళారులదే రాజ్యం. కరోనా పాజిటివ్ వ్యక్తికి బెడ్ కావాలంటే.., డబ్బులు కట్టాలి. మందులు కావాలన్నా..? ఆఖరికి శవాన్ని ఇంటికి తీసుకెళ్లాలన్నా..? చేతులు తడపాల్సిందే. ప్రభుత్వ ఆస్పత్రి అయిన రిమ్స్ కరోనా పేషంట్ చనిపోతే బెడ్ మీద నుంచి మార్చురీకి తరలించడానికి రూ.5,000 కట్టాలి.. అక్కడ నుంచి శవాన్ని స్మశానానికి తీసుకెళ్లడానికి రూ. 25,000 కట్టాల్సిందే. లేదంటే శవం మార్చురీలో మగ్గడమో., మున్సిపాలిటీ వాళ్ల దయ మీద అంత్యక్రియలు జరగడమో జరగాల్సిందే. ఇది ప్రకాశం జిల్లాలో పరిస్థితి.
నెల్లూరులో ప్రభుత్వ ఆదేశాలు భేఖాతారు
నెల్లూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఏపీలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నెల్లూరు జిల్లాలోనే నమోదైంది. ఆ తర్వాత జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల ఫలితంగా కరోనా అదుపులోకి వచ్చింది. కానీ, గత రెండు వారాల నుంచి జిల్లాలో పరిస్థితి అదుపు తప్పుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలే.
జిల్లాలో జి.జి.హెచ్., నారాయణ ఆస్పత్రి, నెల్లూరు ఆస్పత్రులను కోవిడ్ కేర్ సెంటర్లుగా కేవలం కోవిడ్ రోగులకు మాత్రమే చికిత్స అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తగినట్లు నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సదుపాయాలు కల్పించారు. కానీ, ఇక్కడ సి.టీ స్కాన్ లేకపోవడం, ఐ.సీ.యూ.లో ఆక్సిజన్ సదుపాయం ఉన్నాబెడ్స్ తక్కువగా ఉండటంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
ఆరోగ్య శ్రీ పరిధిలో కోవిడ్ కి చికిత్స అందించే అవకాశం ఉండటంతో పేదలు కూడా ప్రైవేటు ఆస్పత్రిలో మెరుగైన సదుపాయాలు ఉన్నాయని అక్కడికి వెళ్తున్నారు. కానీ, రోగులకు చికిత్స అందిస్తూ, చివరి నిమిషంలో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లామని చేతులు దులుపుకుంటున్నారు. దీంతోపాటు.., కోవిడ్ టెస్టుల్లో కూడా దోపిడీ కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన రూ.750 కాకుండా రూ. 1500 వసూలు చేస్తూ.., ఎంట్రెన్స్ నుంచే ప్రజల్ని భయాన్ని క్యాష్ చేసుకుంటూ దోచుకుంటున్నారు.
దీనికి ఉదాహరణ ఈ ఘటన. ఆయన నెల్లూరు కోర్డులో ప్రభుత్వ ఉద్యోగి. ఆయన భార్యకు, ఆయనకు కోవిడ్ పాజిటివ్ రావడంతో నారాయణ కోవిడ్ ఆస్పత్రికి వచ్చారు. బెడ్స్ లేవు, అయినా మీకు సింటమ్స్ అంతగా లేవు. హోం ఐసోలేషన్ ఉండండి అని టెస్టులు అవి చేసి ఓ లక్ష బిల్లు వేసి.., ఇంటికి పంపించారు. కోర్డు ఉద్యోగికి నయమైనా.. ఆయన భార్యకు సీరియస్ కావడంతో మళ్లీ ఆస్పత్రికి వచ్చారు. ఈ సారి బెడ్స్ లేవు అనే సమాధానం. జిల్లా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటే గానీ చివరకి బెడ్ ఇవ్వలేదు.
వారం రోజుల తర్వాత లక్షల్లో బిల్లు వేసి…, శవాన్ని అప్పగించారు. ప్రాణాలు కాపాడాతారని ఆస్పత్రికి వస్తే, శవాన్ని అప్పగించారు అంటూ ఆవేదనతో ఆయన కన్నీటి పర్యంతమై భార్య శవాన్ని ఇంటికి తీసుకెళ్లిపోయారు. చివరి నిమషంలో తీసుకవచ్చారు. కాపాడలేకపోయాము అన్నది ఆస్పత్రి వర్గాల వాదన. మొదట వచ్చినప్పుడే హోం ఐసోలేషన్ కి పంపకుండా ఇక్కడే చికిత్స అందిస్తే నా భార్య బతికేది అనేది ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన.
శృతిమించిన ప్రైవేటు ఆస్పత్రుల దందా
సామాన్యూలను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చి.., కోవిడ్ వ్యాధి చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చారు. కోవిడ్ రోగులకు చికిత్స అందించాలి అనుకునే ఆస్పత్రులు జిల్లా కలెక్టర్ల వద్ద అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకున్న ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి.., జిల్లా అధికారులు కూడా ఆ ఆస్పత్రికి ఓ నోడల్ అధికారిని నియమిస్తారు. నోడల్ అధికారి దగ్గర ఉండి, కోవిడ్ రోగులకు బెడ్స్ కేటాయింపు నుంచి ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందించేందుకు కృషి చేస్తారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు నిర్థారించిన ఫీజులను మాత్రమే వసూలు చేసేలా పర్యవేక్షిస్తారు. కానీ, కొన్ని ఆస్పత్రులు ఈ నింబంధనలను ఉల్లంఘిస్తున్నాయి.
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు ఇవి…!
- నాన్ క్రిటికల్ : రూ. 3,250
- వెంటిలేటర్ లేని ఐ.సి.యూ : రూ. 5.480
- ఐ.సి.యూలో బైపాస్, సిపీఎపీ : రూ. 7,580
- సెప్సిస్ ( ఇన్ ఫెక్షన్ అధికంగా ) వెంటి లేటర్ లేకుండా : రూ. 6,280
- సెప్సిస్ తో వెంటిలేటర్ : రూ. 10,380
- సెప్టిక్ షాక్ లేదా వెంటిలేటర్ పై : రూ10,380
ఈ మేరకు మాత్రమే రోగుల నుంచి ఫీజులు వసూలు చేయాలి. కనీస మొత్తంగా రూ.16 వేలు.. గరిష్ఠంగా రూ. 2.16 లక్షల వరకు చికిత్స ఫీజులను నిర్ణయించింది. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఆస్పత్రుల్లో చేర్చుకోవడంతో పాటు చికిత్స చేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువ శాతం ఈ నిబంధనను పాటించడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు కాకుండా సొంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆస్పత్రిలో చేరిన తర్వాత మందులు లేవని, బ్లాక్ మార్కెట్ పేరిట వేలకు వేలు దోచుకుని ప్రజల్ని బికారుల్ని చేస్తున్నాయి. ఉదాహరణకు Remdesivir injection అసలు ధర సుమారు రూ. 5,000. కానీ, ఆస్పత్రులు వసూలు చేసేది రూ. 35,000 నుంచి 40,000. నాన్ కోవిడ్ ఆసుపత్రిలో ప్రత్యేక రూం కి రూ. 600 తీసుకోవాలి..,కానీ రూ. 10,000 వసూలు చేస్తున్నారు. ఈ రెండు ఉదాహరణలు చాలు ఆస్పత్రులు ఏ విధంగా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నాయో అర్థం చేసుకోడానికి.
లక్షాధికారులవుతున్న మెడికల్ షాపు యజమానులు
నెల్లూరు ఓ మెడికల్ షాప్ ఓనర్ ఆయన. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి సమీపంలో ఉండడంతో వ్యాపారం బాగానే జరిగేది. కరోనాకి ముందు నెలకు 60 నుచి 70 వేల లాభం ఉండేది. ఇప్పుడు నెలకు రూ. సుమారు రూ. 2,00,000 ఆదాయం సంపాయిస్తున్నారు. రూ. 90 దొరికే ధర్మా మీటర్ ని రూ. 250 అమ్ముతున్నాడు. కోవిడ్ మందులు డిమాండ్ ని బట్టి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నాడు. ఇక పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగితే నెలకు వచ్చే లాభం 2 నుంచి 3 లక్షలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదు.
నెల్లూరు జిల్లాలో మరణాలు పెరగడానికి కారణం ఏమిటి..?
ఆంధ్రప్రదేశ్ లో మొదటి పాజిటివ్ కేసు నెల్లూరు నమోదైంది. కానీ, ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రెండు వారాల నుంచి మాత్రం కేసుల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. దీంతోపాటే మరణాలు నమోదవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు ఆస్పత్రులే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో నమోదు కానీ కొన్ని ఆస్పత్రులు ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వకుండా కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు రహస్యంగా చికిత్స అందిస్తున్నాయి. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ రోగి పరిస్థితి విషమించగానే ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రికి పంపిస్తున్నాయి. దీంతో చివరి నిమిషంలో వచ్చిన పేషంట్లను నెల్లూరు జి.జి.హెచ్. కోవిడ్ వైద్యులు రక్షించలేకపోతున్నారు.
మరోవైపు.., ఆరోగ్య శ్రీ పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో మరో దందా సాగుతోంది. కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం కనిష్టంగా రూ. 16,000, గరిష్టంగా రూ. 2, 16,00 మాత్రమే తీసుకోవాలని జీవో జారీ చేసింది. దీనికి మించి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ ప్రభుత్వ ఆదేశాలను కూడా కొన్ని కోవిడ్ ఆస్పత్రులు పాటించడం లేదు. పేషంట్ ఆర్థిక పరిస్థితిని బ్రోకర్ల ద్వారా తెలుసుకున్న ఆస్పత్రి యాజమాన్యాలు.., ఆరోగ్య శ్రీ కింద తక్కువ మొత్తానికే చికిత్స అందుతుంది అని…, పరిస్థితి విషమంగా ఉందని ప్రాణం కాపాడుకోవాలంటే బ్లాక్ మార్కెట్ నుంచి మందులు తెప్పించాలని.., ఆరోగ్య శ్రీ వద్దని తామే సొంతంగా డబ్బులు చెల్లిస్తామని లెటర్ ఇస్తే.., ఐ.సి.యూ. రూం ఇచ్చి మందులు వాడి ప్రాణాలు రక్షిస్తామని ప్రలోభ పెడుతున్నారు.
ప్రాణం కాపాడుకోవడానికి రోగులు కూడా ఆరోగ్య శ్రీ తమకు ఆవసరం లేదని, తామే సొంతంగా డబ్బులు చెల్లిస్తామని లెటర్ రాసి ఆస్పత్రి యాజమాన్యానికి ఇచ్చి ఐ.సి.యూ. రూంలో చేరుతున్నారు. ఇదే అదనుగా అధిక ఫీజులు వసూలు చేస్తూ కోట్లలో సంపాయిస్తున్నారు. ఇలాంటి ఆస్పత్రులపై జిల్లా యంత్రాగం చర్యలు తీసుకోవాలని అనుకున్నా పేషంట్ ఇచ్చిన లెటర్ ని అడ్డం పెట్టుకుని ఆస్పత్రులు తప్పించుకుంటున్నాయి.
ఇప్పటికైనా మెడికల్ మాఫియా కి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయకపోతే.., ఈ దందాకు ముగింపు ఉండదు. చూడాలి.., అధికారులు ఈ అక్రమార్కులను ఏ విధంగా కట్టడి చేస్తారో…!