(నల్గొండ నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఎమ్మెల్యేగా .. ఎన్నికయ్యేది ఎందుకు…?
ఏమిటీ పిచ్చి ప్రశ్న..!
అయ్యే చెప్పండయా .. సామీ..? ఈ ప్రశ్న వెయడం వెనుక ఓ పెద్ద కథ ఉందిలే..?
ఎందుకేమిటి..? ప్రజా సేవ చేయడానికే కదా.. ఏ రాజకీయ నేత అయినా ప్రజా జీవితంలోకి వచ్చేది..?
ఎంత అమాయకంగా సమాధానం చెబుతున్నారు..?
మరెందుకు..?
అదే మరి..? ప్రజాసేవ.. కూసూ గుడ్డూ ఏమీ లేవు.. సొంత లాభం కొంత చూసుకునేందుకే..!
కావాలంటే .. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆఫ్‌ది రికార్డులో చెబుతున్న బహిరంగ మాటలు ఆలకించండి.
‘చూడన్నా.. మన టార్గెట్ వంద కోట్ల రూపాయలు సంపాదించడం. ఇపుడు నా లక్ష్యం ఇది తప్ప మరోటి కాదు.. ప్రభుత్వం నుంచి నయా పైస రావడం లేదు. ఏం పెట్టి అభివృద్ధి పనులు చేస్తం. మనది మనం చూసుకోక పోతే.. రేపు ఎన్నికల్ల ఎవడిస్తడు..? ఎట్టనన్న జేసి మల్ల ఎన్నికల వచ్చేటప్పటికల్లా వంద కోట్ల రూపాయలు సంపాదించాలే. హై కమాండ్ టికెట్ ఇస్తుందా సరే సరి.. లేకుంటే చేసేదెముంది. మనకైతే టికెట్ వస్తుందనుకో.. గెలవాలంటే పైసలు చల్లుడు ఒక్కటే మంత్రం. జనం ముఖాన డబ్బు కొడితే ఓట్లు అవే రాలుతయ్..’….!!
… నల్లగొండ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొడుతున్న ఫోజులివి. నియోజకవర్గాన్ని.. నియోజకవర్గ అభివృద్ధిని ఎప్పుడో గాలికి వదిలేసిన సదరు ఎమ్మెల్యే సొమ్ము చేసుకోవడమే పరమావధిగా పెట్టుకుని ముందుకు వెళుతున్నారు. తన సన్నిహితుల దగ్గర పదే పదే ఇదే మాట చెబుతున్నాడు. ప్రభుత్వం నుంచి నయా పైస అందదు.. అంటూనే.. అధినాయకత్వమే పైసలు సంపాదించుకోమన్నదని కొత్త సూత్రీకరణ చేస్తున్నాడు.
భూముల మీద తప్ప ఎక్కడ పెట్టుబడి పెట్టినా డబ్బులు పెరగవ్ అని కర్తవ్య బోధ చేస్తున్న సదరు ఎమ్మెల్యే… వివాదాల్లో ఉన్న భూములపై కన్నేశాడు. తన బినామీలను ముందు పెట్టి కథ నడిపిస్తూ బాగానే గడిస్తున్నాడని ఆ పార్టీ నాయకులే కుండ బద్దలు కొడుతున్నారు. ఇటీవల జిల్లాలో ఓ భూమి వ్యవహారంలోనే సదరు ఎమ్మెల్యే వివాదాస్పదమయ్యారు. మరో వైపు ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో ప్లాట్లు కొన్న వందలాది మందికి కుచ్చుటోపి పెట్టిన ఓ రియల్టర్‌ను వెనకేసుకు వస్తున్నారన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి.
నష్టపోయిన ప్లాట్ల యజమానులకు న్యాయం చేసేందుకు జిల్లా పోలీసులు మధ్యే మార్గం ద్వారా ప్రయత్నించి సమస్యను ఓ కొలిక్కి తెచ్చారు. అయితే, ఈ వ్యవహారంలో ఏ ప్లాటు యజమానికీ వీసమెత్తు సాయం చేయని ఆ ఎమ్మెల్యే రియల్టర్‌కు, భూమి యజమానికి మధ్య చిన్న సయోధ్య కుదర్చినందుకు బాగానే దండుకున్నారు. ఇలా.. సదరు ఎమ్మెల్యే డబ్బే ప్రాణంగా చేస్తున్న కార్యక్రమాలు అధికార టీఆర్‌ఎస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.. అధినాయకా వింటున్నారా..?