TS Prisons Superindent Dasaradha Ramireddy As OSD To Sajjala Ramakrishna Reddy :
ఆయనో అడ్వైజర్.. అంటే సలహాదారు. మరింతగా చెప్పాలంటే.. ప్రభుత్వానికి పలు అంశాల్లో సలహాలు ఇచ్చే పని అన్న మాట. మరి సలహాలు ఇచ్చేందుకే నియమితులైన సలహాదారుకు అదనంగా అధికారులు, సెక్రటరీలు, అసిస్టెంట్ లు ఎందుకు? ఈ భావన అన్ని ప్రభుత్వాలకు వర్తిస్తుంది గానీ.. ఏపీలోని జగన్ మోహన్ రెడ్డికి మాత్రం వర్తించదు. ఎందుకంటే.. జగన్ సర్కారుకు సలహాలు ఇచ్చేందుకు నియమితులైన సజ్జల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు ఏకంగా ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా ఓ అధికారిని నియమించారు. ఆ అధికారి ఏపీ ప్రభుత్వ అధికారి కాదు. పొరుగు రాష్ట్రం.. నీటి వాటాలపై నిత్యం ఏపీతో తగవులాటకు దిగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి చెందిన అధికారి. పేరు దశరథరామిరెడ్డి. ప్రస్తుతం ఆయన తెలంగాణ జైళ్ల శాఖలో సూపరింటెండెంట్ హోదాలో పని చేస్తున్నారు. ఏపీలో అధికారులే లేనట్లుగా.. ఏరికోరి మరీ తెలంగాణకు చెందిన దశరధరామిరెడ్డిని సజ్జల ఎంచుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ కథ ఇంతటితోనే అయిపోలేదు. ఇంకా చాలానే ఉంది.
అంత అర్జెంటేమిటో?
సజ్జలకు ఓఎస్డీగా నియమితులైన దశరథరామిరెడ్డిని తెలంగాణ సర్కారు ఇప్పటికిప్పుడు రిలీవ్ చేయాలట. అంతేకాదండోయ్.. ఆయన సర్వీసు రికార్డును హుటాహుటీన అమరావతిలోని ఏపీ జీఏడీకి అందజేయాలట. అదేంటీ.. అంతరాష్ట్ర బదిలీల విషయంలో అయితేగియితే కేంద్రం ఆదేశాలు జారీ చేయాలి గానీ.. ఇలా ఓ రాష్ట్రం తన పొరుగు రాష్ట్రాన్ని ఇలా ఆదేశించే అవకాశాలున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలే కాక మీదున్న తెలంగాణ సర్కారు.. ఏపీ తనదైన శైలిలో జారీ చేసిన ఆదేశాలను పాటిస్తుందా? అన్నది కూడా అనుమానాస్పదమే. అయినా ఈ తరహా ఆదేశాల జారీ వెనుక ఉన్న జరిగిన తంతేమిటన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
ఎవరీ దశరథుడు?
ఇక దశరథరామిరెడ్డి విషయానికి వస్తే.. తెలంగాణ జైళ్ల శాఖలో సుధీర్ఘ కాలం పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం అదే శాఖలో సూపరింటెండెంట్ హోదాలో పనిచేస్తున్నారు. అటు సజ్జల, ఇటు దశరథరామిరెడ్డిలు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కదా. బంధుత్వం ఉందో లేదో తెలియదు గానీ.. ఎక్కడో అక్కడ కలిసినప్పుడు బాగానే కలగలసిపోయి ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక దశరథరామిరెడ్డి.. సజ్జల ఓఎస్డీగా ఏకంగా రెండేళ్ల పాటు కొనసాగుతారట. ఈ విషయాన్ని కూడా ఏపీ సర్కారు తన ఆదేశాల్లో పేర్కొనడం గమనార్హం.
Must Read ;- సీఎంగారూ.. సజ్జల సంగతేంటి?