నేలటిక్కెట్.. ఈ తరానికి పరిచయం ఉండకపోవచ్చు. పాత తరానికి ఈ పదం చాలా పరిచయం. సినిమాహాళ్లు (ఇప్పటి మల్టీ ఫ్లెక్స్ లు కాదు..) సాధారణ థియేటర్లలో కుర్చీలు, బల్లలు, నేల టిక్కెట్లు ఉండేవి. అప్పట్లో ఆ ధరలు రూ.50పైసలనుంచి ఒక్క రూపాయి ఉండేది. ఓ మాదిరి ప్రాంతాల్లో ఇలా ఉండేది. టౌన్ లు, నగరాలైతే..ఇంకా ఎక్కువ ఉండేది. ఇప్పుడెందుకు ఈ టాపిక్ అంటారా.. అవును.. ఆ నేల టిక్కెట్ ధరకే..అంటే ఒక్క రూపాయికే విమాన యానం సాధ్యకం చేసిన వ్యక్తి గురించే ఈ చర్చ అంతా. ఇటీవలే ఆన్ లైన్ లో OTT ప్లాట్ ఫాంపై విడుదలైన ఆకాశమే నీ హద్దురా సినిమా..ఆయన జీవితం ఆధారంగా తెరకు ఎక్కించిందే.
అది..2005..జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ఓ సంచలన వార్త వచ్చింది. భారతీయులు ఒక్క రూపాయికే విమాన యానం చేయవచ్చు..అని రిటైర్డ్ ఆర్మీ అధికారి, ఎయిర్ దక్కన్ అధినేత వ్యాపారవేత్త జీఆర్ గోపినాథ్ చేసిన ప్రకటనే ఆ సంచలనం. దేశంలో ఫస్ట్ బడ్జెట్ ఎయిర్ లైన్స్ గా పేరుగాంచింది ఎయిర్ దక్కన్. అప్పటికి ఎయిర్ దక్కన్ ఏర్పాటుచేసి రెండేళ్లైంది. యూరప్ లో చౌక విమానయాన సర్వీసులు అందిస్తున్న ఈజీజెట్, రియానైర్ తరహాలో భారతీయులకూ చౌక విమానయానాన్ని పరిచయం చేశారు. అప్పట్లో ఇది సంచలనం. ఎర్లీ బర్డ్ ప్యాసింజెర్ అంటే.. ముందుగా బుక్ చేసుకుంటే రూపాయికే విమానయానం అవకాశం దక్కింది. మిగతా బుకింగ్ ల విషయానికి వస్తే.. ధరలు ఇతర విమానయాన సంస్థలకంటే తక్కువగానే ఉండేది. దీంతో త్వరిత కాలంలోనే ఆ సంస్థ ప్రజల మన్ననలు పొందింది. విమానం ఎక్కాలని ఆకాంక్షించేవారికి ఈ ఆఫర్ వరమైంది. ఈ విషయాలను గోపినాథ్ తన పుస్తకంలో రాసుకున్నారు. ఆయన కథ ఆధారంగానే ఈ సినిమా కూడా వచ్చింది. ఆర్థిక, సామాజిక గోడలను ఈ విమానయానం బద్దలుకొట్టిందని గోపినాథ్ అభిప్రాయపడ్డారు. ఇక ఎయిర్ దక్కన్ సంస్థ దేశంలో ఎయిర్ ట్రాఫిక్ కనెక్టివిటీని పెంచేందుకు దేశంలో వినియోగం లేని దాదాపు 500 విమానాశ్రయాలను, ఎయిర్ స్ట్రిప్ లను ఎలా వినియోగించుకుని సక్సెస్ అయ్యారో కూడా ఈ సినిమాలో చెప్పారు. మొత్తం మీద సినిమా అంతా..గోపినాథ్ దేనికోసం పోరాటం చేశారనే అంశం చుట్టూ తిరుగుతుంది. ఆయన భార్య కూడా బేకరీ నిర్వహించడం, ఫ్రెండ్స్ సహకారం లాంటివి కూడా పొందుపర్చారు.
ఇక కెప్టన్ గోపినాథ్ విషయానికి వస్తే.. ఆయన పూర్తి పేరు గోరూర్ రామస్వామి అయ్యంగార్ గోపినాథ్. సంక్షిప్తంగా జీఆర్ గోపినాథ్ అంటారు. కర్ణాటక లోని హాసన్ జిల్లాలోని గొరూర్ గ్రామం. ఆయన తండ్రి రామస్వామి అయ్యంగార్ ఉపాధ్యాయుడు, నవలా రచయిత. వ్యవసాయం కూడా చేసేవారు. గోపినాథ్ 1962వరకు ఐదో తరగతి వరకు స్థానికంగా ఉండే కన్నడ మాధ్యమ పాఠశాలలో చదువుకున్నారు. తరవాత బీజాపూర్ సైనిక్ స్కూల్ కి ఎంపికయ్యారు. తరువాతి కాలంలో ఆయన కెప్టెన్ స్థాయికి ఎదిగారు. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాల్గొన్నారు. 28 ఏళ్ల వయసులోనే ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. తరువాత స్నేహితులతో కలిసి పట్టుపరిశ్రమ, ఆటోమొబైల్, ఆతిధ్య రంగాలతో సహా వివిధ వ్యాపార రంగాలలో కాలు పెట్టారు. అవార్డులు తీసుకున్నారు. తరువాతి కాలంలో 1997లో హెలీకాప్టర్ సర్వీసుల కంపెనీ ప్రారంభించారు. ఇలాంటి సంస్థ అప్పటివరకు దేశంలో లేదు. ఆ కంపెనీ ట్యాగ్ కూడా ఆసక్తికరంగానే మారింది. “If you show us a spot on the map, we will get you there.” అనే ట్యాగ్ పెట్టారు. అంటే.. మ్యాప్‌లో మీరే ప్రదేశాన్ని సూచిస్తే, అక్కడకు మిమ్మల్ని తీసుకెళతాం” అనే ట్యాగ్‌లైన్‌తో దీన్ని ప్రారంభించారు.
2000వ సంవత్సరంలో ఆయన అమెరికాకు వెళిన సమయంలో చౌకధరలకు విమానయానం ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. అక్కడి ఫీనిక్స్ ఎయిర్ పోర్ట్ చాలా చిన్నది. మారు మూల ఉండే ఎయిర్ పోర్ట్. కాని అక్కడికి అప్పట్లో రోజుకు వెయ్యి విమానాలు, లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారనే విషయం గమనించారు. ఆ టైంలో భారతదేశంలో ఉన్న 40 విమానాశ్రాయాల్లో కి రాకపోకలు సాగించే విమానాలకంటే.. ఫినిక్స్ విమానాశ్రయానికి వచ్చే విమానాల సంఖ్యే ఎక్కువని ఆయనకు అనిపించింది. అమెరికా విమానయాన మార్కెట్ పై స్టడీ చేశారు గోపినాథ్. అప్పట్లో అమెరికాలో 40వేల విమానాలు నడుస్తున్నాయి. మన దేశంలో రైళ్లు, బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజుకు 3 కోట్లు. ఏటా 1095 కోట్లు. అందులో 5శాతం విమానాయానం చేసినా.. ఏటా కనీసం 53కోట్లు అవుతుందని అంచనావేశారు. ఈ లెక్క పెద్దగా అనిపించినా ఆయన మరో ఆలోచన కూడా చెప్పారు. 53 కోట్లలో మధ్యతరగతి ప్రజలు 20కోట్ల మంది ఉంటారు. వారు ఏడాదికి రెండు సార్లు ప్రయాణించినా 50 కోట్లు అవుతుందని అంచనావేశారు. 2003లో 48సీట్లు ఉండే ఆరు విమానాలతో ఎయిర్ దక్కన్ ను స్థాపించారు. హబ్లీ-బెంగళూరు మధ్య నడిపారు. 2007నాటికి ఆ సంస్థ 380 విమానాలను నడిపే స్థాయికి వచ్చింది. విమానాల సంఖ్య 45కి పెరిగింది. ప్రయాణికుల సంఖ్య రోజుకి 25వేలకు చేరింది. ఆ నాలుగేళ్లలో ఒక్క రూపాయి టిక్కెట్ తో ప్రయాణించిన వారి సంఖ్య 30 లక్షలకు చేరింది. కాని తరువాతి కాలంలో ఖర్చులు భరించడం కష్టంగా మారింది. 2007లో ఆ సంస్థను విజయ్ మాల్యా నిర్వహించే కింగ్ ఫిషర్ కు అమ్మేశారు. తరువాత ఎయిర్ దక్కన్ పేరును కింగ్ ఫిషర్ రెడ్ గా మార్చారు. తరువాతి కాలంలో చాలా సంస్థలు లోకాస్ట్ టిక్కెట్ లను అందించాయి. 2011నాటికి కింగ్ ఫిషర్ రెడ్ కూడా మూతపడింది. వ్యాపారం మూతపడింది. కాని 2018నాటికి విమానయాన ప్రయాణికుల సంఖ్య 14కోట్లకు చేరింది. అప్పట్లో విజయ్ మాల్యా తన వ్యాపారాలపై సమయం వెచ్చించలేదని గోపినాథ్ మీడియాతో కూడా వ్యాఖ్యానించారు. ఎయిర్ దక్కన్ ఆగిపోవచ్చు..కాని ఆయన స్ఫూర్తి, ఆ ఆలోచన విమానయాన రంగంలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిందని చెప్పవచ్చు.











