(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న సందర్భంలో విజయనగరం ప్రజలను అప్రమత్తం చేయడంలో జిల్లా పోలీసు శాఖ ప్రధాన పాత్ర పోషించింది. విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ఆధ్వర్యంలో జిల్లా పోలీసుశాఖ కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో నియంత్రణకు ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించినందుకు, వలస దారులకు అందించిన సేవలకు జిల్లా పోలీసు శాఖకు రెండు విభాగాల్లో జాతీయ స్థాయిలో స్కాచ్ అవార్డులు లభించాయి. అలానే ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించినపుడు ప్రజలకు విజయనగరం పోలీసు శాఖ అందించిన విశిష్టమైన సేవలకు గాను ‘అస్యూరెన్సు విత్ ఎండ్యూరెన్సు అండ్ సర్వీసు విత్ సేక్రిఫైజ్’ జాతీయ అవార్డుతో మొత్తంగా జిల్లా పోలీసు శాఖకు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు లభించాయి.
Must Read:-అప్పుడు లేని కరోనా భయం ఇప్పుడేందుకు మీకు?
వ్యూహకర్తను మాత్రమే .. ఎస్పీ
జాతీయ స్థాయిలో మూడు అవార్డులను సొంతం చేసుకున్న వేళ విజయనగరం ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ తాను వ్యూహం మాత్రమే రచించానని, జిల్లా శాఖా సిబ్బంది సమర్ధవంతంగా పని చేసినట్లు తెలిపారు, సక్రమ పద్ధతిలో అమలు చేసి, ప్రజలకు కరోనా ప్రభావంపై అవగాహన కల్పించి, ఎక్కువ కాలం జిల్లాను గ్రీన్‌జోన్‌లో నిలిపి జాతీయ స్థాయిలో విజయనగరం జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చారన్నారు. ఇంతటి ప్రఖ్యాతి సాధించటంలో జిల్లాకు చెందిన ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులన్నారు. వలస కార్మికులను ఆదుకోవడంలో ప్రజలు స్పందించిన తీరు అద్భుతమని, జిల్లా పోలీసు శాఖకు అందరూ అందించిన సహకారంతోనే మనమంతా కరోనాను జయించగలిగామన్నారు. దురదృష్టవశాత్తు జిల్లా పోలీసుశాఖ ఐదుగురు పోలీసుల ప్రాణాలను కోల్పోయిందన్నారు. కరోనాను ఎవ్వరూ నిర్లక్ష్యం చెయ్యవద్దని, వాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తలు పాటించాలన్నారు. పోలీసు శాఖ ప్రజలకు అవగాహన కల్పించిన కారణంగానే జిల్లాలో మారుమూల గ్రామాల్లో కూడా ఫ్లెక్సీలు దర్శన మిచ్చాయన్నారు. మహిళా సంరక్షణ పోలీసులు, ఇతర శాఖల వారు కూడా పోలీసు శాఖకు తమ సహకారాన్ని అందించారని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో పోలీసు శాఖ అందించిన సేవలను ప్రజలు గుర్తించారని, ఈ మంచితనాన్ని, సేవా భావాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించి జిల్లా పోలీసుకు మరింత మంచి పేరు, ప్రఖ్యాతులు తీసుకొనిరావాలన్నారు. ఈ అవార్డులు పోలీసుల బాధ్యతలను మరింత పెంచాయని జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు.
Also Read:-నరేంద్ర మోడీ ప్రభావశీలురే కానీ…
ఎస్పీకి ఘన సన్మానం
జాతీయ అవార్డులు సాధించడంలో జిల్లా పోలీసు శాఖకు మార్గ నిర్దేశం చేసిన ఎస్పీ రాజకుమారిని ఒఎస్డి ఎన్. సూర్యచంద్రరావు, డీఎస్పీలు, సీఐలు, అర్ ఐలు, ఇతర పోలీసు అధికారులు గజమాల, దుశ్శాలువలు, జ్ఞాపికలు, పూల మొక్కలను అందించి ఘనంగా సత్కరించారు. Also Read:- నాడు హుద్ హుద్.. నేడు కరోనా