ఉక్కు తయారీలో ప్రపంచంలో దిగ్గజ కంపెనీగా ఎదిగిన ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ… జపాన్ కు చెందిన మరో కంపెనీ నిప్పన్ స్టీల్ తో కలిసి ఏర్పాటు చేయనున్న భారీ ఉక్కు కర్మాాగారం నిజంగానే ఏపీకి మరో ఆణిముత్యంగా మారనుందని చెప్పాలి. ఇప్పటికే రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ ఉక్కు) కంపెనీతో ఉత్తరాంధ్ర ఉక్కు తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోగా … తాజాగా మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీల కర్మాగారంతో ఆ ప్రాంతం దేశంలోనే అతి పెద్ద ఉక్కు తయారీ కర్మాగారాన్ని కలిగి ఉన్న ప్రాంతంగా సరికొత్త గుర్తింపును సంపాదించుకోనుంది. విశాఖ ఉక్కును ఆనుకుని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఏర్పాటు కానున్న ఈ కర్మాగారం దాదాపుగా రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏర్పాటు కానుంది. దీని ద్వారా ఏకంగా 65 వేలకు పైగా ఉద్యోగావకాశాలు కూడా రాష్ట్ర యువతకు అందబాటులోకి రానున్నాయి. ఏ లెక్కన చూసినా.. మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీ నూతన కర్మాగారం ఏపీలో నూతన పారిశ్రామిక ఒరవడికి శ్రీకారం చుట్టనుందని చెప్పక తప్పదు.
వైసీపీ పాలనలో నాటి సీఎం జగన్ దమన నీతిని చూసి చాలా మంది పారిశ్రామికవేత్తలు ఏపీని వదిలి పారిపోయిన వైనం మనం ప్రత్యక్షంగానే చూశాం. ఫలితంగా గడచిన ఐదేళ్లలో రాష్ట్రం పారిశ్రామికంగా తీవ్రంగా నష్టపోయింది. ఈ రంగంలో రాష్ట్రం తిరోగమన వృద్ధిని నమోదు చేసింది. అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీని పాడె కట్టిన రాష్ట్ర ప్రజలు టీడీపీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు. ఫలితంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఏర్పడిన కూటమి సర్కారులో విద్య, ఐటీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్,… రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పురోభివృద్ధిలోకి తీసుకొచ్చే బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలో ఏపీ, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మిట్టల్, నిప్పన్ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా ఓ భారీ ఉక్కు తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న లోకేశ్.. మిట్టల్ స్టీల్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. అందులో భాగంగా మిట్టల్ స్టీల్ ఎండీ ఆదిత్య మిట్టల్ తో జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో లోకేశ్ ఇచ్చిన ప్రజెంటేషన్ కు ముగ్ధుడైన ఆదిత్య మిట్టల్ తన ప్రతిపాదిన భారీ ఉక్కుతయారీ కర్మాగారాన్ని ఏపీలో ఏర్పాటు చేసేందుకు అక్కడికక్కడే ప్రకటించేశారు. వెరసి సింగిల్ జూమ్ కాల్ తో లోకేశ్ రూ.1.50 లక్షల కోట్లతో ఏర్పాటు కానున్న మిట్టల్ నిప్పన్ స్టీల్ ఫ్యాక్టరీని ఏపీకి తెచ్చేశారన్న మాట.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రతిపాదనలకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీలు క్రమానుగత చర్యలను చేపట్టనున్నాయి. తొలుత 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఉక్కు ఫ్యాక్టరీని ఆ కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం సదరు కంపెనీ రూ.56 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఆ తర్వాత అక్కడే మరో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మరో ఉక్కు తయారీ కర్మాగారాన్ని ఆ కంపెనీ నెలకొల్పనుంది. దీని కోసం మిట్టల్ నిప్పన్ స్టల్ కంపెనీలు ఏకంగా రూ.80 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నాయి. తొలి దశను 2029 నాటికి పూర్తి చేయనున్న మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీలు… రెండోొ దశను 2033 నాటికి పూర్తి చేయనున్నాయి. వెరసి 2033 నాటికి విశాఖ ఉక్కు సమీపంలో దానిని మించిన ఓ భారీ ఉక్కు తయారీ కర్మాగారం ఆవిష్కృతం కానుందన్న మాట. ఈ ఫ్యాక్టరీ ద్వారా అటు ప్రత్యక్షంగా 65 వేల మేర ఉద్యోగాలు లభించనున్నాయి. అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో నక్కపల్లి విశాఖలోని స్టీల్ సిటీని తలదన్నేలా ఓ భారీ టౌన్ షిప్ నకు కేంద్రం కానుంది.
మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీలు తమ ప్రతిపాదిత ఉక్కు తయారీ ఫ్యాక్టరీ కోసం ఏకంగా 6,756 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం… ప్రస్తుతానికి నక్కపల్లి పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ పరిధిలో ఉన్న 700 ఎకరాలను మిట్టల్ నిప్పన్ కంపెనీలకు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన భూమిని సేకరించే పనిని ఏపీఐఐసీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ భూసేకరణను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం ఏపీఐఐసీని ఆదేశించింది. మిట్టల్ నిప్పన్ స్టీల్స్ అడిగిన భూమిలో సదరు కంపెనీలు ఏర్పాటు చేయనున్న ఉక్కు తయారీ కర్మాగారాలతో పాటుగా క్యాప్టివ్ పోర్టు, టౌన్ షిప్ లు ఏర్పాటు కానున్నాయి. ఇవన్నీ ఏర్పాటు అయితే…ఈ ప్రాంతం ఉత్తరాంధ్రకే ఓ మణిహారంగా మారనుందని చెప్పక తప్పదు. అంతేకాకుండా రాష్ట్ర యువతకు ఈ కంపెనీ ద్వారా పరోక్షంగా లక్షలాది ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలూ లేకపోలేదు.