హైదరాబాద్…ఈ నగరమంటే ఇష్టంలేని వారు ఎవరూ ఉండరు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా అందరినీ అక్కున చేర్చుకునే విలక్షణమైన ప్రత్యేకత హైదరాబాద్ నగరానికి సొంతం. కిందిస్థాయి వర్గం నుంచి కుబేరుల వరకు జీవనాన్ని అందించగలిగే ప్రత్యేకత దేశంలోని మరే ఇతర నగరానికి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరైనా ఈజీగా బతికేయొచ్చు. ఇతర నగరాల నుంచి రోటి, కపడ, కమాన్ కోసం బతకడానికి వచ్చే వారు ఇక్కడ ఎలాగో అలా బతికేస్తుంటారు. ప్లేట్ భోజనం రూ.5లకూ దొరుకుతోంది. అలాగే అదే ప్లేట్ భోజనం రూ.10 వేలకు కూడా నగరంలో దొరుకడం ప్రత్యేకత. ఎవ్వరికి ఎలా కావాలో ఇక్కడ అన్ని వసతులు అందుబాటులో ఉంటాయి.
ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి ఇష్టపడటానికి ప్రధాన కారణం ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది. దేశంలో బెంగుళూరు, పూణె, చెన్నై, ఢిల్లీ ఇతర నగరాలలో చూడని వాతావరణం హైదరాబాద్కే సొంతం. ఏడాదిలో వచ్చే ఆరు రుతువులు చూసే భాగ్యం భాగ్యనగరానికే చెల్లుతోంది. అందుకే భిన్న వర్గాల ప్రజలు ఉద్యోగ, వ్యాపారాలను కొనసాగించడానికి హైదరాబాద్ ను ఇష్టపడుతుంటారు. అత్యంత సాధారణమైన జీవనం గడిపే, కడుపేదరికంలో జీవించే బస్తీలు ఉంటాయి. అలాగే విలాసవంతమైన జీవనం సాగించే బడా బంగ్లాలు ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే చిన్నా..పెద్దా అని తేడా లేకుండా కడుపు చేతపట్టుకొని హైదరాబాద్ నగరానికి వచ్చే ఎవ్వరినైనా హైదరాబాద్ తన కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది.
హైదరాబాద్ పై మక్కువ అప్పటి నుంచే….
హైదరాబాద్ అంటే మక్కువ ఆ కాలం నుంచే ఏర్పడింది. నీవాసయోగ్యమైన నగరం కావడంతో అటు ఉత్తర భారతదేశం నుంచి, ఇటు దక్షిణ భారతదేశం వరకు హైదరాబాద్ నగరానికి భిన్న జాతులు, కులాల వారు అప్పట్లోనే వలస వచ్చారు. కుతుబ్‌షాహీల కాలంలో మొదలైన వలసలు అసఫ్‌జాహీల కాలం నాటికి ఊపందుకున్నాయి. ఇలా హైదరాబాద్ అంటే ఇష్టం ఈ నాటిది కాదు.
34 నగరాల్లో ది బిస్ట్ హైదరాబాదే…
హాలిడిపై.కామ్ అనే వెబ్ సైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. దేశంలో నివాసయోగ్యమైన, ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేల్లో హైదరాబాద్ అత్యుత్తమమైన నగరంగా నిలించింది. అంతర్జాతీయ స్థాయినైనా, జాతీయ స్థాయి సర్వేల్లోనైనా అగ్రశ్రేణి స్థానంలో హైదరాబాద్ ఎప్పుడూ నిలుస్తూ వస్తోంది. ఈ ఏడాది జనవరి, జూన్ మధ్య కాలంలో నిర్వహించిన సర్వేలో నివాస, ఉపాధి అవకాశఆలు, ఇతరత్ర అంశాల ఆధారంగా జరిగిన సర్వేలో భాగ్యనగరం మొదటి స్థానంలో నిలిచినట్లు హాలిడిపై సంస్థ తెలిపింది. హైదవరాబాద్ తరువాత స్థానాల్లో ముంబాయి, పుణె, చెన్నై, బెంగళూరు నగరాలు నిలిచాయి. చారిత్రక కట్టడాలైన చార్మినార్, గోల్కొండ కోటలు చూడదగిన ప్రదేశాలతో పాటు అనేక చారిత్రక కట్టడాలు హైదరాబాద్లో ఉన్నట్లు సర్వేలో తెలిపింది. నగర పర్యటనకు సెప్టెంబర్ నుంచి మార్చి వరకు మంచి సమయమని సర్వే సంస్థ పేర్కొంది. అలాగే ఇటీవల జెఎల్ఎల్ 2020 సూచీలోనూ హైదరాబాద్…ప్రపంలోనే ఉత్తమమైన సిటీగా గుర్తింపు సొంతం చేసుకుంది.











