టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి(73) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.తీవ్ర అనారోగ్యంతో మూడు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న బొజ్జల ఇటీవలే కొంత కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో చికిత్స నిమిత్తం ఆయనను కుటుంబ సభ్యులు తిరిగి అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొజ్జల చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు.అలిపిరి ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా గాయపడ్డారు.ఇటీవల బొజ్జలను ఆయన నివాసంలో పరామర్శించిన చంద్రబాబు, ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపించారు. టీడీపీ పేరు మీద రూపొందించిన కేక్‌ను బొజ్జలకు చంద్రబాబు స్వయంగా తినిపించారు.
కాగా బొజ్జల మృతి పై చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మంచి మిత్రుడిని కోల్పోయానని ఆయన పేర్కొన్నారు. బొజ్జల కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాని చంద్రబాబు అన్నారు.